నిర్మల్/ఆదిలాబాద్/మంచిర్యాల/ ఆసిఫాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం సమైక్యత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా పార్టీల లీడర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళి అర్పించారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన యోధుల త్యాగాలను కొనియాడారు. నిర్మల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. అనేక పోరాటాలతో నిజాం నవాబ్ తెలంగాణను భారత్ లో విలీనం చేశారని పేర్కొన్నారు. అమరుల ఆశయాలు కొనసాగించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ, జడ్పీ చైర్పర్సన్విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, రైతు సమన్వయ వేదిక జిల్లా చైర్మన్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మతం మంటలు రేపే కుట్రలు..
తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ , త్యాగ ధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్చిన్న శక్తులు కుట్రలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఫైర్అయ్యారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. తెలంగాణలో ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఆనాడు యావత్తు సమాజం ఉద్యమించిందన్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రంభీం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మ ఇలా ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు ప్రతీఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలకు కొనసాగింపుగా వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషా, నటరాజ్, ట్రైనీ కలెక్టర్ శ్రీజ తదితరులు ఉన్నారు.
ఐటీడీఏలో ..
ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీసులో పీవో కె. వరుణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో కనక భీం రావు, ఏజెన్సీ డీఎంహెచ్‌వో మనోహర్, ఈఈ రాథోడ్ భీమ్ రావు, జేడీఎం నాగభూషణ్, పీవీటీజీ భాస్కర్, ఏవో రాంబాబు, ఏసీఎంవో జగన్ పాల్గొన్నారు.
సమరయోధుల త్యాగాలు వెలకట్టలేనివి
మంచిర్యాలలో జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో ఉత్సవాలు నిర్వహించారు. విప్ సుమన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిపథంలో సాగుతుందన్నారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ భారతి హోళికేరి, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రెయినీ కలెక్టర్ పి.గౌతమి, డీసీపీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి...
జాతీయ సమైక్యత స్ఫూర్తితో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ చెప్పారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ఆవరణలో కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలకు చీఫ్‌గెస్ట్‌గా హాజరై హాజరయ్యారు. అంతకుముందు పోలీసుల గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. త్యాగధనుల పోరాటులు గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోడు భూమల పరిష్కరారం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీచేసినట్లు తెలిపారు. గిరి వికాస పథకం ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ సురేశ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పేయ్ , ఎస్పీ సురేశ్ కుమార్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, డీఆర్వో సురేశ్తదితరులు పాల్గొన్నారు.
