అమల్లోకి రాని రెండు కొత్త జిల్లాలు: రాష్ట్రం లెక్క 33.. కేంద్రం లెక్క 31

అమల్లోకి రాని రెండు కొత్త జిల్లాలు: రాష్ట్రం లెక్క 33.. కేంద్రం లెక్క 31

రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేరని ములుగు, నారాయణపేట
కేం ద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్న సర్కారు
పని చేయని చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ మంత్రం

ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాలు 33. ఇది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ కేంద్ర ప్రభుత్వం లెక్కలో రాష్ట్రంలోని జిల్లాలు 31 మాత్రమే. ఎందుకంటే ములుగు, నారాయణపేట జిల్లాలకు ఇంత వరకూ రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. పాత ఉత్తర్వుల్ని సవరిస్తినే రెండు జిల్లాలకు అధికారిక గుర్తింపు వచ్చినట్టు. అప్పటి వరకు రాష్ట్రంలోని జిల్లాలు 31. 2016 అక్టోబర్​2న దసరా సందర్భంగా 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజించారు. ఆ సమయంలోనే ములుగు, నారాయణపేటలను కూడా జిల్లాలుగా చేయాలంటూ ఆందోళనలు జరిగాయి. వాటిని రాష్ట్ర సర్కారు సీరియస్ గా తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములుగు, నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. తిరిగి ప్రభుత్వంలోకి రాగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ రెండు జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాల సంఖ్య 33కు చేరింది.

రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ఆలస్యం

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలు స్థానికులకే ఉండాలనే కారణంతో కొత్త జోన్లు ఏర్పాటు చేసారు. 2018 మేలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కోసం సీఎం కేసీఆర్ నేరుగా ప్రధాని మోడీని కలిసారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు ఆలస్యం అవుతుందని వెంటనే కొత్త జోన్లను ఆమోదించాలని కోరారు. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫైలుపై సంతకం చేయడంతో సెప్టెంబర్ 1 2018 నుంచి రాష్ట్రంలో కొత్త జోన్లు అమల్లోకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు లేఖలు రాసింది. కానీ ఆ లేఖలకు స్పందన లేదని అధికారులు అంటున్నారు.

పనిచేయని చీఫ్ అడ్వైజర్ మంత్రం

పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఢిల్లీలో ప్రభుత్వ చీఫ్​ అడ్వైజర్ రాజీవ్ శర్మ హవా బాగా ఉండేది. కొత్త జోన్లను రాష్ట్రపతి అమోదించడంలో ఆయన పాత్ర కీలకమైందని, వారం పాటు అక్కడే మకాం వేసి ఆర్డర్స్ తెప్పించారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలనే డిమాండ్​ విషయంలో మాత్రం ఆయన మంత్రం పనిచేయలేదని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖలో రాజీవ్​శర్మకు సన్నిహితంగా ఉండే అధికారులను అడిగితే ఫైలును పంపాలని హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని జవాబిచ్చినట్టు సమాచారం.

ఆ రెండు జిల్లాల యువతకు నష్టమే

ములుగు, నారాయణపేట జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చకపోతే గతంలో అంతర్భాగంగా ఉన్న భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉద్యోగాలకు మాత్రమే వారు అర్హులవుతారు. ఈ మధ్య రిక్రూట్ చేసిన పంచాయతీ సెక్రటరీ పోస్టుల్లోనూ ములుగు, నారాయణపేట జిల్లాల స్థానికులు నష్టపోయారు. మరోవైపు కొత్త జోన్ల ఏర్పాటు సమయంలో వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్‌లో చేర్చారు. అయితే తమను చార్మినార్ మల్టీ జోన్ లో చేర్చాలంటూ అక్కడి యువత ఆందోళన చేసాయి. దీనిపై సీఎం కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ నారాయణపేట, ములుగు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ మార్పు విషయం లేదని తెలిసింది.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి