
పెన్షన్ పైసలు పెంపు.. జూన్ నుంచే అమలులోకి
ఎల్లుండి నుంచి పెన్షనర్లకు ప్రొసీడింగ్స్ పంపిణీ
ఆ వెంటనే ఖాతాల్లోకి సొమ్ము
బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్ తొలగింపు
కొత్త మున్సిపల్ బిల్లుకు సరేనన్న మంత్రివర్గం
సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఏజ్ లిమిట్‌ను తగ్గిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
జాబితా రెడీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వృద్ధాప్య పెన్షన్ల వయో పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర పెన్షన్ పైసలను కూడా పెంచింది. బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుమారు ఐదు గంటలపాటు కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 57 ఏండ్లు నిండిన పేదల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాల వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ. వెయ్యి నుంచి రూ.2,016కు పెంచారు. దివ్యాంగులు, వృద్ధ కళాకారులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ. 1,500 నుంచి రూ. 3,016కు పెంచారు. ఈ పెరిగిన కొత్త పెన్షన్లు జూన్ నుంచి అమలులోకి వస్తాయి. వీటి ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 20 నుంచి లబ్ధిదారులకు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. నియోజకవర్గాలవారీగా ప్రొసీడింగ్స్ అందించేందుకు సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రొసీడింగ్స్ పంపిణీ పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పడుతాయి. పెన్షన్ల కోసం ఏడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చు కానుంది. దీంట్లో రూ.11,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, రూ. 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించనుంది. వృద్ధాప్య పెన్షన్ల ఏజ్ లిమిట్‌ను తగ్గిస్తామని, పెన్షన్ల సొమ్మును పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీల అమలులో భాగంగా కేబినెట్ ఆమోదం తెలిపింది.
బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్ తొలగింపు
పెన్షన్‌కు సంబంధించి బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను తొలగించాలని కేబినేట్ నిర్ణయించింది. బుధవారం (17.-07.-2019) వరకు కూడా పీఎఫ్ ఖాతా ఉన్న బీడీ కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారులను ఆదేశించింది.
కొత్త మున్సిపల్ బిల్లుకు ఆమోదం
కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ఈ బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.