32 గంటలైనా దొంగలను పట్టుకోరా?.. కరీంనగర్ బంగారం షాపు దోపిడీ బాధితులకు పరామర్శ

32 గంటలైనా దొంగలను పట్టుకోరా?.. కరీంనగర్ బంగారం షాపు దోపిడీ బాధితులకు పరామర్శ

 

  • నేరాల్లో బిహార్, యూపీని తలదన్నేలా తెలంగాణ
  • హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటనలే జరుగుతున్నయని వ్యాఖ్య :  కేటీఆర్
  • కరీంనగర్​ బంగారం షాపు దోపిడీ బాధితులకు పరామర్శ​ 

కరీంనగర్/ రాజన్నసిరిసిల్ల, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి హయాంలో బిహార్, ఉత్తర ప్రదేశ్ ను తలదన్నేలా తెలంగాణ రాష్ట్రం నేరాల్లో నంబర్ వన్ గా నిలిచే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్ లో ఐదు తుపాకులతో దొంగలొచ్చి బంగారం దోచుకునిపోతే సీఎం, పోలీసులు ఏం చేస్తున్నారని.. దోపిడీ జరిగి 32 గంటలైనా దొంగలను పట్టుకోరా? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి దోపిడీ ఘటనలో గాయపడినవారిని సోమవారం కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

ఇటీవల హైదరాబాద్ చందానగర్ లోనూ జ్యుయలరీ షాపులో బంగారాన్ని, కోఠి ఏటీఎంలో తుపాకులతో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారని గుర్తుచేశారు. ఈ ఘటనల్లో దొంగలను ఇప్పటి వరకు పట్టుకోలేదని మండిపడ్డారు. కరీంనగర్ లో పట్టపగలు 11 గంటలకు తుపాకులతో దొంగలు వస్తే.. ఇక్కడి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

వెంటనే స్పందించి నాకాబందీ పెట్టి ఉంటే దొంగలు దొరికే వారన్నారు. ఎప్పటివో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి తమ కార్పొరేటర్లను జైళ్లలో వేశారని, పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫైర్​అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి.. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చోవడం కాదని, శాంతిభద్రతలను కమాండ్ చేయాలని సూచించారు. 

రేవంత్‌‌‌‌ను విమర్శించని బండి సంజయ్.. 

బండి సంజయ్ నోట్లో నుంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట రాదని, రేవంత్ రెడ్డిని అనడానికి భయం ఎందుకని కేటీఆర్​ప్రశ్నించారు. హైదరాబాద్ లోని కాందీశికుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనే బండి సంజయ్ మాట్లాడడం లేదని ఆరోపించారు. తనకు అన్నీ తెలుసని.. టైం ప్రకారం అన్నీ బయటకి వస్తాయన్నారు. ‘ఎంత డీప్ గా కనెక్షన్లు ఉన్నాయి. ఏమేం జరుగుతున్నాయి. అన్ని బయటికి వస్తాయి. సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. 

దోచుకో.. దాచుకో అన్నట్టు పాలన తయారైంది..

రాష్ట్రంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు వారి పని సక్కగా జేస్తలేరని.. దోచుకో.. దాచుకో అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి తయారైందని కేటీఆర్​ ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను దోచుకుంటుంటే.. జిల్లాల్లో ఇతర మంత్రులు, ఎమ్యెల్యేలు దోచుకుంటున్నారని అన్నారు. సోమవారం సిరిసిల్లలో 10 వ వార్డు కౌన్సిలర్ బొల్గం వైష్ణవి, నాగరాజు బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దాదాపు వెయ్యి మంది రైతులు చనిపోయారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్​ఎస్సేనని, సీఎం అయ్యేది కేసీఆరే నని అన్నారు. చిన్నబోనాల నుంచి పార్టీలో చేరిన బొల్గం నాగరాజు గౌడ్, ఇతర నాయకులు పాత పంచాయతీలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలన్నారు.