
- జులైలో పది రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్స్ పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు
- బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమండ్ చేసిన రిజర్వేషన్ల ప్రకారం ముందుకు
- వచ్చే నెల మొదటి వారంలో కేబినెట్ భేటీలో తుది నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జూన్ నెలాఖరులో షెడ్యూల్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అయితే, ఈ రెండు ఎన్నికలను కూడా పది రోజుల గ్యాప్లోనే పూర్తిచేయాలని భావిస్తున్నది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగితే.. ఆ తర్వాత పది రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. లేదంటే ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు చేపట్టనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగనుండగా, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లిన సంప్రదాయాన్ని ఈ సారి కూడా పాటించాలని భావిస్తోంది. అయితే, ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే.. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుందో తెలుస్తుంది. మిశ్రమ ఫలితాలు వస్తే అధికార పార్టీకి ఇబ్బందిగా మారి, సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయంపై కొందరు ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అధికారులు మాత్రం ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి సమ్మతి తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో, జూన్ చివరి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, జులైలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలోనే రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగానే ఎన్నికల నిర్వహణపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కేబినెట్ మీటింగ్లో రిజర్వేషన్లకు ఆమోదం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాన కారణంగా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లును ఆమోదించి.. రాష్ట్రపతికి పంపింది. అయితే, కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. అదే సమయంలో పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు నిలిచిపోయాయి. దీంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది.ఈ నేపథ్యంలోనే బీసీ డెడికేటెడ్కమిషన్బీసీలకు సంబంధించి చేసిన రిజర్వేషన్ల నివేదికను పరిగణనలోకి తీసుకోనుంది.
జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి.. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలుపనున్నారు. కోర్టు తీర్పునకు లోబడి రిజర్వేషన్ల సీలింగ్‌లో మార్పు లేకుండా బీసీలకు దాదాపు 23 శాతం వరకు రిజర్వేషన్లు దక్కుతాయి. అయితే, మిగిలిన 19 శాతాన్ని కూడా బీసీలకు కేటాయించి.. మొత్తం 42 శాతం పార్టీ పరంగా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఆ రకంగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.