
బీఆర్ ఎస్, బీజేపీ కుట్రలతోనే బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని తెలంగాణ పీసీసీ చైర్మన్ మహేష్ గౌడ్ అన్నారు. బీసీలకు మేలు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ ఎస్ తట్టుకోలేకపోతున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే అడ్డుకున్నారు..బీసీలకు న్యాయం జరిగే వరకు ఎన్నికలకు వెళ్లమని స్పష్టం చేశారు మహేష్ గౌడ్.
గురువారం(అక్టోబర్9) బీసీ లకు 42 రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో నం 9 పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గందరగోళంలోపడింది. దీంతో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీని అందుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కోర్టు ఉత్తర్వుల కాపీని అనుసరించి నిర్ణయం తీసుకోనుంది.
గురువారం కోర్టు తీర్పుతో బీసీ సంఘాల నేతలు భగ్గున మండిపడ్డారు. హైకోర్టు ముందు నిరసనలకు దిగారు. రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కోర్టు తీర్పుపై కొంత నిరాశగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ బీసీ నేతలు 42 శాతం రిజర్వేషన్ల సాధించే వరకు ఎన్నికలకు పోమని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పై కట్టుబడి ఉందని ప్రకటించారు.
ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని నాలుగు వారాల్లోగా చెప్పాలని,రెండు వారాల్లో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలపాలని గడువు పెట్టడంతో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ గందరగోళంలో పడింది. గురువారం నోటిఫికేషన్ రాగా కొందరు అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు.
సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తిరిగి నోటిఫికేషన్ వేస్తారా..ఎప్పుడు నిర్వహిస్తారు..బీసీలకు 42 రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో అమలు అవుతాయా వంటి అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తానికి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో సర్పంచ్ , జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రయ సందిగ్ధంలో పడటంతో ఔత్సాహిక అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.