- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్
- సోనియాకుకిషన్ రెడ్డి లేఖ రాయటం విడ్డూరం
- తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుంటే ఆయనేం చేస్తున్నరు?
- రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు కనిపించడం లేదా అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో 12 ఏండ్ల బీజేపీ పాలనపై చర్చించటానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. ‘‘కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటో ప్రజలకు వివరించాలి. ఆరు గ్యారంటీల అమలుపై సోనియా గాంధీకి ఆయన లేఖ రాయడం విడ్డూరం. సోనియాను ప్రశ్నించే స్ధాయి కిషన్ రెడ్డికి లేదు” అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
మరి.. ఈ 12 ఏండ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు ఎక్కడ? తెలంగాణపై అడుగడుగున కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంటే.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చే సామర్థ్యం లేని కిషన్ రెడ్డికి, సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు లేదు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపుతున్నది. బీసీ రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసీ నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నది” అని మహేశ్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.
