తెలంగాణకు దేవుడిచ్చిన చిన్నమ్మ

తెలంగాణకు  దేవుడిచ్చిన చిన్నమ్మ

“అవురేక్ దక్కా  తెలంగాణ పక్కా ” ఆరేళ్ల కింద ఈ నినాదం కోట్లాది తెలంగాణ  గొంతుకల్లో ప్రతి ధ్వనించింది. ప్రత్యేక రాష్ట్రం పక్కా అనే భరోసానిచ్చింది తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్. తెలంగాణ కోసం చాలా ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటాన్ని  ఆమె గుర్తించింది. పోరాటానికి మద్దతునిచ్చింది. వందలాది తల్లులకు పుత్రశోకం లేకుండా చేయగలిగింది.  ఉత్తరాదికి చెందిన నాయకులకు తెలంగాణ గోస, ఆవేదన,  బాధ అంత సులభంగా అర్థం కాదనే అభిప్రాయాన్ని తప్పని నిరూపించింది. పార్లమెంట్ లో బిల్లుకు మద్దతునిచ్చి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి పురుడు పోసింది. ఇవాళ ఆమె మన మధ్య లేరు. ఆమె మనకు ఇచ్చిన మద్దతుతో వచ్చిన  ప్రత్యేక రాష్ట్రం ఆమెను మరువలేదు.

అది తెలంగాణ ఉద్యమం చివరి  ఘట్టానికి చేరుకున్న సమయం.  తెలంగాణ చరిత్రలో  ఉద్యమాలు చేయడం, ఎదురు దెబ్బలు తినడమే తప్ప విజయాలు సాధించిన సందర్భాలు చాలా తక్కువ. సమీప చరిత్రనే తీసుకుంటే తెలంగాణ ప్రజలు  ఏకతాటిపైకి వచ్చి కొట్లాడి సాధించుకున్న డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం. దీనికి ముగ్గురు అమ్మలు జాతీయ స్థాయిలో మద్దతునిచ్చారు. వీరు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్, మీరాకుమార్. ప్రతిపక్షాల  మద్దతు లేకుండా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యే పరిస్థితి లేదు.అధికార, ప్రతిపక్ష సభ్యులు రాజీనామాలు చేయాలనే డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమైంది. ఇదే క్రమంలో ఆనాటి కాంగ్రెస్  ఎంపీలు  వివేక్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మంద జగన్నాథం, రాజయ్య, రాజగోపాల్ రెడ్డి,  తదితరులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పార్లమెంట్ గేటు ముందు నిరసన దీక్షలు చేపట్టారు. ఇప్పుడు తప్పిస్తే  తెలంగాణ ఇక రాదనే  భయం  అందర్లోనూ ఉన్నది. సరిగ్గా ఆ సమయంలోనే  తానూ ఉన్నానంటూ బీజేపీ నేతగా, ఓ తల్లిగా  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు సంపూర్ణ మద్దతునిచ్చారు సుష్మ.  తనపై ఒత్తిళ్లు వచ్చినా వెనక్కు తగ్గ లేదు. సరి కదా కన్న తల్లి కడుపు  కోత తనకు తెలుసని అన్నారు. ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యలపై ఆందోళన చెందారు. ఇదే విషయాన్ని పార్ల మెంట్ లోపలా, బయటా  చెప్పారు.

2014లో పార్లమెంట్  ముందుకు తెలంగాణ బిల్లు వచ్చింది. దాన్ని అడ్డుకుని తీరుతామని సమైక్యాంధ్ర నాయకులు పంతం పట్టారు.   రాష్ట్ర ఏర్పాటు బిల్లు రాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు లగడపాటి రూపంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ర్పే తో   బీభత్సం సృష్టించారు. అయినా చిన్నమ్మ మద్దతునిచ్చింది.  బిల్లు పాస్ అయింది. పార్లమెంట్  తలుపులు మూసి  బిల్లు పాస్ చేశారనే విమర్శలు  సీమాంధ్ర  నాయకులు చేశారు.  కానీ వాస్తవాన్ని చూడలేని, తల్లుల కడుపుకోత చూసేందుకు మూసుకుపోయిన గుండె కవాటాలు తెరుచుకోవాలంటే బిల్లు పాస్ కు తలుపులు మూయక తప్పదనే పరోక్ష సమాధానం ఇచ్చారు.  తెలంగాణ ప్రజలకు కొత్త దారిని, బతుకుపై  కొత్త భరోసాను ఇచ్చారు. ఓ తల్లిగా ఆమె తల్లడిల్లింది కాబట్టే అడుగు ముందుకేసింది. 15వ లోక్ సభ చివరి సమావేశాల్లో ఇంత కీలకమైన బిల్లు ఎందుకని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె మాట తప్పలేదు. మడమతిప్ప లేదు. తెలంగాణ ప్రజల చిన్నమ్మగా  తన పాత్రను  సమర్థవంతంగా పోషించారు. తానూ తెలంగాణ కోసం నిలబడ్డానని  నిరూపించుకున్నారు.

అప్పట్లో  జేఏసీ   నాయకులు  ఢిల్లీ పెద్దలను ఒప్పించాలంటే తప్పకుండా కలవాల్సిన నాయకుల్లో సుష్మ ఒకరు. ఎవర్ని ఒప్పిస్తే తెలంగాణ వస్తుందనే చర్చలో సుష్మా స్వరాజ్  పేరు తప్పకుండా ఉండేది. అంతేకాదు,  తన అద్భుతమైన  మాట తీరుతో  ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను తన  సొంత పార్టీ వారికి,   సభలోని   సాటి సభ్యులకూ ఆమె  వివరించారు.  ఇక్కడ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారికి సైతం ఆమెను సంప్రదించాల్సిన పరిస్థితి. బిల్లు పాస్ చేయడానికి సుష్మ చేసిన మేలు గురించి అప్పట్లో కేసీఆర్ తో పాటు చాలామంది నాయకులు థ్యాంక్స్  చెప్పారు.  ఆనాడు  రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునిచ్చి తెలంగాణకు చిన్నమ్మ అయ్యారంటూ కేటీఆర్ తాజాగా ట్వీట్ చేస్తూ ఆమెను గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ లో బిల్లు  పాసైన తర్వాత బయటికొచ్చి తెలంగాణ  ప్రాంత ఎంపీలను ఉద్దేశించి ‘‘రాష్ట్రం ఇచ్చినందుకు అమ్మ (సోనియా)తో పాటు ఈ చిన్నమ్మను కూడా మరవద్దు.’’ అని సుష్మాస్వరాజ్ అన్నారట. నిజమే మరి, తెలంగాణ ఉద్యమానికి అవసరమైన సమయంలో అండగా నిలబడిన సుష్మను తెలంగాణ  సమాజం ఎన్నటికీ మరిచిపోదు. ఇచ్చిన మాటను నిలుపుకున్న మనిషితనానికి, నాయకత్వపటిమకు యావత్ తెలంగాణ  కన్నీటి హృదయంతో నివాళులు అర్పిస్తోంది.

– గొర్ల బుచ్చన్న

సుష్మను చూస్తే తెలంగాణ తల్లిని చూసినట్టే…..

తెలంగాణ ఊరూ వాడా ఉద్యమ నినాదం అయినప్పుడు అడుగులో అడుగేసిన  సుష్మా స్వరాజ్  కట్టూ బొట్టుతో బోనం ఎత్తుకుంటే అచ్చం తెలంగాణ తల్లిని చూసినట్లే  అన్పించింది. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా తల్లి మనసు ఒక్కటే. అందుకే  ఈ ప్రాంత తల్లుల, బిడ్డల గోసను, ఆర్తిని, ఆవేదనను అర్థం చేసుకుని తెలంగాణ ప్రజల  వెన్నంటి ఉన్నారు. 2009లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వనున్నట్లు  నాటి కేంద్ర  హోం మంత్రి చిదంబరం ప్రకటన చేసిన నాటి నుంచి 2014లో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఆమె  ఉద్యమంతోనే ఉన్నారు.  ఉద్యమకారుల గొంతుతో  గొంతు కలిపారు. హైదరాబాద్​,  మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సభల్లో  మాట్లాడుతూ  తెలంగాణ బిల్లుకు మద్దతునిచ్చి తీరుతామన్నారు. మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రం ఏర్పడితే తమ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు. పార్టీ విస్తరిస్తుందనే భరోసా కూడా లేదు. కానీ మాట ఇచ్చాం కాబట్టి దానిపై నిలబడాలని సుష్మ అనుకున్నారు.  ప్రత్యేక రాష్ట్రం వస్తే  ప్రజల భవిష్యత్తు బాగుంటుందని నమ్మారు.  అందుకే తెలంగాణ ప్రజలు  సుష్మలో చిన్నమ్మను చూసుకున్నారు. తెలంగాణ  ఇలవేల్పులా భావించారు.  వందలాదిమంది ప్రాణత్యాగాల ఫలితాన్ని ప్రత్యేక రాష్ట్రం రూపంలో చూపించారు.

పాతికేళ్లకే ఎమ్మెల్యే

సుష్మా స్వరాజ్ రాజకీయ జీవితంలో అనేక  రికార్డులున్నాయి. 1977లో హర్యానా అసెంబ్లీకి ఆమె తొలిసారిగా ఎన్నికయ్యారు. అప్పటికి ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. అప్పటి హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కేబినెట్ లో తక్కువ వయసున్న మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 27 ఏళ్లకే జనతా పార్టీ హర్యానా శాఖ పగ్గాలు చేపట్టారు. అంత చిన్న వయసులో ఒక జాతీయ పార్టీ  రాష్ట్ర శాఖ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఇండియన్ పాలిటిక్స్ లో చాలా అరుదు. ఆ తర్వాత  బీజేపీ తొలి మహిళా అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇదొక రికార్డు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి పదవి చేపట్టిన లీడర్ గా మరో రికార్డు సృష్టించారు. ఢిల్లీకి తొలి మహిళా సీఎం అయ్యారు. అంతేకాదు బీజేపీ తరఫున తొలి మహిళా కేంద్ర మంత్రి గానూ సుష్మా  స్వరాజ్ రికార్డు నమోదు చేసుకున్నారు. 15వ లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఆమె వ్యవహరించారు. దీంతో లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేసిన తొలి మహిళగా ఆమె ఇంకో  రికార్డు  సొంతం చేసుకున్నారు. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న  ఫస్ట్ లేడీ గా సుష్మా స్వరాజ్ మరో రికార్డు క్రియేట్ చేశారు.

లోక్​సభ సమావేశాల లైవ్..​

బీజేపీ సీనియర్​ లీడర్​ సుష్మాస్వరాజ్ మొత్తం నాలుగు సార్లు సెంట్రల్​ మినిస్టర్​గా పనిచేశారు. తొలిసారి 1996లో ప్రధాని వాజ్​పేయి కేబినెట్​లో సమాచార, ప్రసార శాఖ​ మంత్రి అయ్యారు. ఆ సర్కారు 13 రోజులకే పడిపోయినా ఆమె లోక్​సభ చర్చలను లైవ్​ ఇవ్వాలనే సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి 1998లో మళ్లీ వాజ్​పేయి మంత్రివర్గం​లో సుష్మా స్వరాజ్​కు చోటు లభించింది. అప్పుడూ ఆమెకు తొలుత అదే శాఖను కేటాయించారు. ఆ ఏడాది మార్చి 19న టెలీకమ్యూనికేషన్​ శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించారు.

ఇండియా నుంచి అప్​లింకింగ్..​

1998లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ హైకమాండ్​ సుష్మా స్వరాజ్​ను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపింది. ఆ ఎలక్షన్​లో బీజేపీ ఓడిపోవటంతో సుష్మా స్వరాజ్​ 1999లో మరోసారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 సెప్టెంబర్​ నుంచి 2003 జనవరి దాక మూడోసారి కేంద్ర సమాచార, ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలోనే ప్రసారాలకు సంబంధించి ఇండియా నుంచి అప్​లింకింగ్​ ఫెసిలిటీ ప్రారంభమైంది.

కన్నడంలో ధారాళంగా

కర్ణాటకతో సుష్మా స్వరాజ్ కు  ప్రత్యేక అనుబంధం ఉంది. 1999లో బళ్లారి సీటు నుంచి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ లోక్ సభ  ఎన్నిక బరిలోకి దిగినప్పుడు ఆమెపై బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విదేశీ కోడలికి, స్వదేశీ కూతురికి మధ్య పోటీగా బళ్లారి  ఎన్నికను బీజేపీ ప్రచారం చేసింది. బళ్లారి ప్రజలతో కనెక్ట్ కావడానికి భాషనే ఆయుధంగా చేసుకున్నారు సుష్మ. పట్టుదలతో కన్నడ భాషను నేర్చుకున్నారు. బహిరంగ సభల్లో కన్నడంలోనే మాట్లాడారు.

దేశ విదేశాల్లో ప్రశంసలు

నరేంద్ర మోడీ గవర్నమెంట్​లో సుష్మా స్వరాజ్​ కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారు. 2014 మే 26న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఆ పదవిలో ఐదేళ్లూ కొనసాగారు. సుష్మా స్వరాజ్​ నాలుగు సార్లు సెంట్రల్​ మినిస్టర్​ అయినా పూర్తిగా ఐదేళ్లు పదవిలో ఉండటం ఇదే తొలిసారి. ఈ ఐదేళ్లలో ఆమె పనితీరుకు ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. టెర్రరిజంపై యూఎన్​ఓలో సుష్మా స్వరాజ్​ చేసిన ప్రసంగం, పాకిస్థాన్​ వ్యవహార శైలిని పట్టిచూపిన విధానం శెభాష్​ అనిపించాయి.