కేసీఆర్‌‌‌‌‌‌ను ప్రజలు క్షమించరు : మల్లికార్జున ఖర్గే

కేసీఆర్‌‌‌‌‌‌ను ప్రజలు క్షమించరు :  మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: అధికార మత్తులో, అహంకారంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కేసీఆర్ దూషించారని ఏఐసీసీ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే.. న్యాయం, సంక్షేమం, అభివృద్ధి అని, ఈ నినాదానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. పేదల కోసం ఇందిరా గాంధీ ఎంతో చేశారని గుర్తుచేస్తూ గురువారం ట్విట్టర్‌‌‌‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. పాకిస్తాన్‌‌తో పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. రాయ్ బరేలీ, మెదక్ రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించినా.. తెలంగాణ ప్రజల కోసం మెదక్ ఎంపీగానే ఇందిర కొనసాగారని చెప్పారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో మొదటిసారి నీటిని విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోయి ఉంటే తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ రైస్‌‌ బౌల్‌‌గా మారిందన్నారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే.. పేదలకు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీల హక్కులు నెరవేరుతాయని ఖర్గే పేర్కొన్నారు.