
అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన గోవర్ధన్‌రెడ్డి డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో మేనేజరుగా పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8.30గంటలకు స్టోర్‌లోకి చొరబడిన దుండగులు గోవర్ధన్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన దుండగులను నల్లజాతీయులుగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని ఫ్లోరిడాలోని మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి భార్య, ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ ఉప్పల్ లో నివాసముంటున్నారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. గోవర్ధన్‌రెడ్డి పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతుండగా.. చిన్న కుమార్తె ఏడో తరగతి చదువుతోంది.