
- శాంపిల్స్ సేకరించిన ఎక్సైజ్ అధికారులు
- మహబూబ్‌నగర్ ‘డి’ అడిక్షన్ సెంటర్‌కు పెరుగుతున్న బాధితులు
కల్తీ కల్లు తాగి హైదరాబాద్‌లో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిన క్రమంలో ఆ ప్రకంపనలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానూ తాకుతున్నాయి. ఇక్కడి యంత్రాంగం తనిఖీలకు సిద్ధం కాగా.. దుకాణ యజమానులు ముందే అలర్ట్ అయ్యారు. మొన్నటి వరకు కొన్ని షాపుల్లో మందు కలిపిన కల్లు అమ్మారనే ఆరోపణలుండగా.. ఇప్పుడు మాత్రం మంచి కల్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఆఫీసర్లకు చిక్కకుండా యజమానులు జాగ్రత్తలు పడుతున్నారు. మరోవైపు ఎక్సైజ్ అధికారులు ప్రతీ షాపును తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు పంపుతున్నారు.
మహబూబ్‌నగర్, వెలుగు: కల్తీ కల్లు కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కూకట్పల్లి ఘటనను సీరియర్‌గా తీసుకున్న సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా కల్లు దుకాణాలపై తనిఖీలకు ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు రాగా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. కల్లు కాంపౌండ్లను ఎక్సైజ్ సీఐలు, ఎస్ఐలు సిబ్బందితో కలిసి పరిశీలిస్తున్నారు. శాంపిల్స్ తీసుకుని హైదరాబాద్‌లోని ల్యాబ్స్‌కు పంపుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని జడ్చర్ల, బాదేపల్లి, మూసాపేట, నసురుల్లాబాద్, గొండ్యాల్, టంకర, బోయపల్లి, ఏనుగొండ, సీసీకుంట, కోయిల్‌కొండ, హన్వాడ.. నారాయణపేట జిల్లాలో మక్తల్ మండలం సంగంబండ, కాచ్వార్, కాట్రేవుపల్లి, నారాయణపేట మండలం పెరపళ్ల, నారాయణపేట టౌన్, ఏక్లాస్పూర్, జలాల్పూర్, ఊట్కూర్ మండలం కొల్లూర్, తిప్రస్పల్లి, పులిమామిడి, పెద్దజట్రం, నర్వ మండలం ఉందేకోడ్, మరికల్ మండలం జిన్నారం, మాగనూర్ మండలం ఓబుళాపురం, కృష్ణా మండలంలోని హిందూపూర్ గ్రామాల్లో కల్లు కాంపౌండ్లను ఇప్పటికే తనిఖీలు చేసి
శాంపిల్స్ సేకరించారు.
తనిఖీలకు వస్తున్నారని తెలిసి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్లు దుకాణాలను ఆఫీసర్లు తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరిస్తుండటంతో వ్యాపారులు అలర్ట్ అయ్యారు. నాలుగైదు రోజుల క్రితం వరకు జిల్లాల్లో మందు కల్లు విక్రయాలు జోరుగా సాగాయనే ఆరోపణలు ఉండగా.. ఇప్పుడు మామూలు కల్లు అమ్ముతున్నట్లు సమాచారం. కల్తీ కల్లు అమ్ముతున్నట్లు శాంపిల్స్ టెస్టింగ్‌లో బయట పడితే ప్రభుత్వం నుంచి చట్టపరమైన చర్యలు ఉంటాయనే భయంతో వ్యాపారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటి వరకు డ్రమ్ముల కొద్దీ కల్లును తయారు చేయగా.. ఇప్పుడు పావు వంతు మాత్రమే తయారు చేస్తున్నట్లు సమాచారం. హానికర రసాయనాలు కలువకుండా చూసుకుంటున్నారు.
‘డి’ అడిక్షన్ సెంటర్‌కు పెరుగుతున్న బాధితులు
మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని ‘డి’ అడిక్షన్ సెంటర్‌కు రోజురోజుకు మత్తు పదార్థాలకు అలవాటుపడిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో లిక్కర్, గంజాయి, మందు కల్లుకు అలవాటుపడిన బాధితులు ఉంటున్నారు. రోజుకు ఎనిమిది నుంచి పది మంది వరకు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిలో ఎక్కువగా మందు కల్లుకు అలవాటుపడిన వారే ఉంటున్నట్లు తెలిసింది. సోమవారాల్లో ఈ సెంటర్‌కు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. గత సోమవారం నుంచి శుక్రవారం వరకు దాదాపు వంద మందికి ట్రీట్మెంట్ అందించారు. ఇందులో ఒక్క సోమవారమే 35 మందికి ట్రీట్మెంట్ ఇవ్వగా.. మంగళవారం 17 మందికి, బుధవారం 12 మందికి, గురువారం 15 మందికి, శుక్రవారం 16 మందికి చికిత్స అందించినట్లు అక్కడి రికార్టుల్లో
నమోదైంది.
తనిఖీలు ముమ్మరం చేశాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పరిధిలో 28 శాంపిల్స్‌ను సేకరించాం. వాటిని టెస్టుల కోసం పంపించాం. కల్తీ కల్లు నియంత్రణకు శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
సుధాకర్‌గౌడ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్