రోజుకు 16 గంటలు డ్యూటీ..పని ఒత్తిడిలో పోలీసులు

రోజుకు 16 గంటలు డ్యూటీ..పని ఒత్తిడిలో పోలీసులు
  • ఎమర్జెన్సీ డ్యూటీలు, సిబ్బంది కొరత
  • కామన్‌‌కాజ్‌‌, లోక్‌‌నీతి సీఎస్‌‌డీఎస్‌‌ సర్వే
  • మత వివక్ష చూపే ఖాకీలు తక్కువే
  • స్పీడ్‌‌గా స్పందించడంలో లేటు
  • ఎస్టీల కేసుల విషయంలో వెనుకబాటు

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్ర పోలీసులు పని ఒత్తిడితో సతమతమవుతున్నరు. రోజులో సగానికిపైగా టైం డ్యూటీలోనే ఉంటున్నరు. దేశంలో పోలీసులు సగటున 14 గంటలు పనిచేస్తుంటే రాష్ట్రంలో సగటున 16 గంటలు విధుల్లోనే ఉంటున్నరు. కామన్‌‌కాజ్‌‌, లోక్‌‌నీతి సీఎస్‌‌డీఎస్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది.పని భారం పెరగడం, ఎమర్జెన్సీ డ్యూటీ, సిబ్బంది కొరత సహా ఇంకా చాలా కారణాల వల్ల డ్యూటీలోనే ఉంటున్నారని సర్వేలో తెలిసింది.ఫలితంగా నిద్రలేమి, సమయానికి తిండి తినక అనారోగ్యం, ఊబకాయం, గ్యాస్ట్రిక్‌‌ సమస్యల బారినపడుతున్న వాళ్లు పెరుగుతున్నట్లు వెల్లడైంది.

వీక్లీ ఆఫ్‌‌ కూడా లేదు

సుమారు 51 శాతం మంది పోలీసులు తమకు వీక్లీ ఆఫ్‌‌ ఇవ్వడం లేదన్నారని సర్వేతో తేలింది. 26 శాతం మంది నెలలో ఒక రోజు, 4 శాతం మంది నెలలో రెండ్రోజులు తీసుకుంటున్నట్లు చెప్పారు. 19 శాతం మంది ఈ ప్రశ్నకు స్పందించలేదు. వీక్లీ ఆఫ్‌‌ లేక మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పారు.

వేగంగనే స్పందిస్తున్నరు

నేరం జరిగినప్పుడు సమాచారం రాగానే స్పందించే విషయంలో పోలీసులకు దేశంలో తొమ్మిదో ర్యాంకు దక్కింది. నేర సమాచారం ఇవ్వగానే పోలీసులు స్పందించడం లేదని 42.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. వెంటనే స్పందిస్తున్నారని  9.0 శాతం, కొన్నిసార్లు స్పందిస్తున్నారని 16.5, ఎప్పుడో ఒకసారి స్పందిస్తారని 15.4 శాతం మంది అన్నారు.

ఉన్నోళ్లకే ఎక్కువ విలువ

పోలీస్‌‌ స్టేషన్‌‌కు వచ్చే బాధితుల్లో ఊన్నోళ్లకు ఇచ్చినంత ప్రాధాన్యం పేదోళ్లకు ఇస్తలేరని సర్వేలో వెల్లడైంది. పేద, ధనిక విషయంలో పోలీసులు వివక్ష చూపుతున్నారా అన్న ప్రశ్నకు 56 శాతం మంది అవునని, లేదని 32 శాతం మంది చెప్పారు.

సాయంలో పోలీసులు ఓకే

బాధితులు పోలీసులను సంప్రదించాక వారందించిన సాయం సంతృప్తినిచ్చిందా ? లేదా ? అంటే రాష్ట్రంలో 30.09 శాతం మంది సంతృప్తికరంగా ఉందన్నారని సర్వే చెప్పింది. 43.2 శాతం మంది కొంతమేర సంతృప్తికరంగా ఉందన్నారని, 8.6 శాతం మంది కొంత అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారని పేర్కొంది. 11.1 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంది. ఈ అంశంలో 7.4 స్కోరుతో రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది.

పిల్లల్ని ఒంటరిగా పంపలేం

పోలీస్‌‌ స్టేషన్లకు పిల్లలను ఒంటరిగా పంపుతారా? అంటే పశ్చిమబెంగాల్‌‌లో 87 శాతం మంది పంపిస్తామని చెప్పగా, తెలంగాణలో 12 శాతం మందే చెప్పారని సర్వే పేర్కొంది. ఈ అంశంలో రాష్ట్రం చివరి స్థానం(22)లో ఉంది.

మత వివక్ష తక్కువే

మత ప్రాతిపదికగా బాధితులపై వివక్ష చూపిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో 21 శాతం మంది అవునని సమాధానం చెప్పగా, 63 శాతం మంది కాదన్నారని సర్వే వెల్లడించింది. ముస్లింల విషయంలో అడగ్గా చూపుతున్నారని 26 శాతం మంది, లేదని 57 శాతం మంది సమాధానమిచ్చారని పేర్కొంది. టెర్రరిస్ట్‌‌ కార్యకలాపాల విషయంలో ముస్లింలపై తప్పుడు కేసులు పెడుతున్నారా? అంటే 55 శాతం మంది అవునని, 19 శాతం మంది కాదని చెప్పినట్టు సర్వేలో తేలింది.

వివిధ అంశాల్లో రాష్ట్రం స్థానం ఇలా..

  •  క్రైం రేటు ఇండెక్స్‌‌లో రాష్ట్రం 19వ స్థానం.
  •  పోలీసులు, కోర్టుల్లో పరిష్కారమవుతున్న కేసుల ఇండెక్స్‌‌లో 15వ స్థానం.
  •  పోలీసులకు వసతుల సూచీలో 18వ స్థానం.
  •  ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, చిన్నారులపై జరిగిన హింసకు సంబంధించిన కేసుల పరిష్కారంలో 18వ స్థానం.
  •  ఎస్టీలపై జరుగుతున్న హింసకు సంబంధించిన కేసుల పరిష్కారంలో వరస్ట్‌‌ పర్ఫార్మెన్స్‌‌ ప్రదర్శిస్తున్న మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.