- ప్రాణాలకు తెగించి క్రిమినల్స్‌ను పట్టుకున్న యాదయ్య
- డ్యూటీలో ధైర్య సాహసాలకు గుర్తింపుగా రాష్ట్రపతి మెడల్
- రాష్ట్ర పోలీసులకు మొత్తం 29 పతకాలు..
- దేశవ్యాప్తంగా 1,037 మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోం శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు చూపిన తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి శౌర్య పతకం(పీఎంజీ) లభించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఒకే పీఎంజీని ప్రకటించగా, అది రాష్ట్రానికి చెందిన యాదయ్యకు దక్కడం విశేషం. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి యేడాది మాదిరిగానే కేంద్ర హోం శాఖ బుధవారం పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 1,037 మందిని గ్యాలంట్రీ/సర్వీసు పతకాలకు ఎంపిక చేసి, అవార్డుల జాబితాను విడుదల చేసింది. 213 మందికి గ్యాలంట్రీ (శౌర్య) మెడల్స్(జీఎం), ఒకరికి రాష్ట్రపతి శౌర్య పతకం(పీఎంజీ), 94 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు(పీఎస్‌ఎం), 729 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్ (ఎంఎస్‌ఎం) ప్రకటించింది. ఇందులో తెలంగాణకు మొత్తం 29 పతకాలు దక్కాయి. ఏడు గ్యాలంట్రీ మెడల్స్, మూడు విశిష్ట సేవా పతకాలు, మరో 18 మందికి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి.
ఏడుగురికి శౌర్య పతకాలు..
తెలంగాణకు చెందిన సునీల్ దత్ (ఎస్‌పీ), మోరా కుమార్ (డిప్యూటీ అసాల్ట్ కమాండర్/రిజర్వ్ ఇన్ స్పెక్టర్), శనిగరపు సంతోష్ (అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్/రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్), అమిలి సురేష్ (జూనియర్ కమాండో / పోలీస్ కానిస్టేబుల్), వెల్ముల వంశీ (జూనియర్ కమాండో /పోలీస్ కానిస్టేబుల్), కంపాటి ఉపేందర్ (జూనియర్ కమాండో/పోలీస్ కానిస్టేబుల్), పాయం రమేష్ (జూనియర్ కమాండో/ పోలీస్ కానిస్టేబుల్)కు గ్యాలంట్రీ మెడల్స్ దక్కాయి. అలాగే విశిష్ట సేవా విభాగంలో రాష్ట్రపతి మెడల్స్ సంజయ్ కుమార్ జైన్ (ఏడీజీ), కటకం మురళీధర్ (డీసీపీ), వెంకటేశ్వర్లు కందిమల్ల (డ్రైవర్ ఆపరేటర్, ఫైర్ సర్వీస్)ను వరించాయి.
18 మందికి మెరిటోరియస్ మెడల్స్..
పోలీసు శాఖలో 11 మందికి, పైర్ సర్వీస్ లో ఏడుగురికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్(ఎంఎస్ఎం) దక్కాయి. అవినాష్ మొహంతి (పోలీస్ కమిషనర్), సయ్యద్ జమీల్ బాషా (కమాండెంట్), పి. కృష్ణ మూర్తి (ఎఎస్‌పీ), కొమరబత్తిని రాము (ఎస్ఐ), అబ్దుల్ రఫీక్ (ఎస్ఐ), ఇక్రమ్ అబ్ ఖాన్ (ఎస్ఐ), శ్రీనివాస మిశ్రా (ఎస్ఐ), కుంచాల బాలకాశయ్య (ఎస్ఐ), లక్ష్మయ్య (ఏఎఎస్ఐ), గుంటి వెంకటేశ్వర్లు (ఏఎస్ఐ), నూతలపాటి జ్ఞాన సుందరి (ఇన్‌స్పెక్టర్) పోలీస్ శాఖ నుంచి ఈ పతకాలు అందుకోనున్నారు. అలాగే ఫైర్ సర్వీస్ విభాగంలో మాధవరావు తెలుగు (లీడింగ్ ఫైర్‌మెన్), వాహెదుద్దీన్ మహ్మద్ (లీడింగ్ ఫైర్‌మెన్), హోంగార్డ్ విభాగంలో లక్ష్మి బందోళ్ల, మల్లేష్ మేడిపల్లి, కవిత ఇంటూరి, గాలయ్య నమల, సుమలత ఎనుములకు పతకాలు దక్కాయి.
కత్తిపోట్లను లెక్కచేయకుండా.. దొంగలను పట్టుకున్న యాదయ్య
తెలంగాణ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందిస్తోన్న చదువు యాదయ్య ఇద్దరు క్రిమినల్స్ ను పట్టుకోవడంలో పట్టుకోవడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. 2022, జులై 25న ఓ మహిళ మెడలో ఇద్దరు దొంగలు బంగారు గొలుసు చోరీ చేశారు. చైన్ స్నాచింగ్, ఆయుధాల డీలింగ్ లో పేరు మోసిన క్రిమినల్స్ ఇషాన్ నిరంజన్ నీలంపల్లి, రాహుల్ అనే ఇద్దరు ఈ చోరీ చేసినట్టు గుర్తించారు.
మరునాడు ఆ ఇద్దరు బొల్లారం ఎక్స్ రోడ్డులో ఉన్నట్టు తెలుసుకుని, యాదయ్య తన బృందంతో కలిసి నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. కానీ, క్రిమినల్స్ ఇద్దరూ ఎదురు తిరిగి కత్తితో దాడి చేశారు. అయినా యాదయ్య పట్టు వదలలేదు. చాతీ, వీపు, ఎడమ చేతులు, కడుపులో పదే పదే పొడిచినా ధైర్యం కోల్పోలేదు. ఒంటిపై తీవ్రమైన కత్తిపోట్లతో రక్తం ఏరులై పారుతున్నా క్రిమినల్స్ ను మాత్రం వదిలిపెట్టలేదు. అనంతరం ఆయన 17 రోజులు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడారు. యాదయ్య చూపిన ఈ ధైర్యసాహసాలను గుర్తించి ఈ ఏడాది ఆయనకు కేంద్ర హోం శాఖ పోలీస్ శాఖలోనే ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ ను ప్రకటించింది.
యాదయ్యకు డీజీపీ సన్మానం
రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్‌కు ఎంపికైన మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యను డీజీపీ జితేందర్ అభినందించారు. బుధవారం లక్డీకపూల్‌లోని డీజీపీ ఆఫీస్‌లో యాదయ్యను డీజీపీతో పాటు అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, ఐజీపీ రమేశ్ సన్మానించారు. 2022లో ఇద్దరు కరుడుగట్టిన క్రిమినల్స్‌ను ప్రాణాలకు తెగించి పట్టుకుని యాదయ్య అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. వివిధ విభాగాల్లో పతకాలు పొందిన ఇతర పోలీసు సిబ్బందికి కూడా డీజీపీ, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
