ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్.! 60 నుంచి 90 శాతం ప్రకటించే చాన్స్

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్.! 60 నుంచి 90 శాతం ప్రకటించే చాన్స్
  • ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు?
  • ఈ–చలాన్‌‌ వెబ్‌‌సైట్‌‌ను అప్‌‌డేట్ చేస్తున్న పోలీసులు
  • డిస్కౌంట్‌‌పై గైడ్‌‌లైన్స్‌‌ వచ్చిన తర్వాత నోటిఫికేషన్
  • ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదు

హైదరాబాద్‌‌, వెలుగు: పెండింగ్‌‌లో ఉన్న ట్రాఫిక్‌‌ చలాన్లను క్లియర్‌‌‌‌ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. భారీగా డిస్కౌంట్ ఆఫర్‌‌‌‌ చేసేందుకు ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. తోపుడు బండ్లు, ఆర్టీసీ బస్‌‌లకు చలాన్స్‌‌లో 90 శాతం.. బైక్స్, ఆటోలకు 80 శాతం.. కార్లు, హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్, ట్రక్స్‌‌కు 60 శాతం డిస్కౌంట్‌‌ ఆఫర్ చేసే అవకాశం ఉంది. 

చలాన్లను డిస్కౌంట్‌పై క్లియర్ చేసుకునేందుకు ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే తమకు ఎలాంటి గైడ్‌లైన్స్‌ అందలేదని ట్రాఫిక్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. డిస్కౌంట్స్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అంటున్నారు.

18,33,761 ‘హెల్మెట్‌’ కేసులు

ఈ ఏడాది ఇప్పటికే 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికంగా 18,33,761 చలాన్లు హెల్మెట్‌ పెట్టుకోనందుకు వేసినవి ఉన్నాయి. పెండింగ్‌ చలాన్స్‌పై డిస్కౌంట్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చేస్తున్నది. గతేడాది తరహాలోనే ఈ చలాన్‌ వెబ్‌సైట్‌ను అప్‌డేట్‌ చేసే పనులు ప్రారంభించింది. చలాన్‌లో డిస్కౌంట్‌ చేయగా చెల్లించాల్సిన అమౌంట్‌కు సంబంధించి మార్పులు చేస్తున్నది. వాహనాల కేటగిరీని బట్టి రాయి తీ అమౌంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. దీనిపై పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

గతేడాది ఆఫర్‌‌లో 2.92 కోట్ల చలాన్స్ క్లియర్‌‌

గతేడాది మార్చి1వ తేదీన ఇలాంటి ఆఫర్‌‌ను అమలు చేశారు. బైక్స్, ఆటోలకు 75 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కార్లు, లైట్ మోటర్ వెహికల్స్‌కి 50 శాతం, తోపుడు బండ్లకు 80 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారు. 46 రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 2.92 కోట్ల చలాన్లకు సంబంధించి రూ.300 కోట్లకు పైగా వసూలు అయ్యింది. గతంలో డిస్కౌంట్‌ ఆఫర్‌‌కు నోడల్‌ ఆఫీసర్‌‌గా వ్యవహరించిన ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్‌ నుంచి కూడా పోలీస్ ఉన్నతాధికారులు సలహాలు తీసుకున్నారు.