
- పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం సర్కారు ఆఫర్
- ఉత్తర్వులు జారీ.. అర్ధరాత్రి నుంచి అమలులోకి
- చలాన్ పోర్టల్ అప్‌డేట్ చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైక్‌లు, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు,హెవీ మోటార్ వెహికల్స్‌కు 60 శాతం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు మంగళవారం జీవో విడుదల చేశారు. చలాన్స్ పెండింగ్‌లో ఉన్న వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. డిస్కౌంట్ ఆఫర్‌ను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే పోలీసులు ఈ–చలాన్ సైట్‌ను అప్‌డేట్ చేశారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీరో అవర్ నుంచి డిస్కౌంట్ ఆఫర్‌లో పేమెంట్స్ జరిగే విధంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. అయితే జీవో విడుదలైన వెంటనే ఈ చలాన్ సైట్‌పై వాహనదారుల తాకిడి పెరిగింది. దీంతో చలాన్ పోర్టల్ మొరాయిస్తున్నది. వాహనదారులు తమ వెహికిల్స్‌పై ఎన్ని చలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుందామనుకున్నా అవకాశం లేకుండా పోయింది. అయితే ముందుగా ప్రకటించినట్లు 26 వ తేదీ నుంచే డిస్కౌంట్ ఆఫర్‌ను అమలు చేసే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. వెహికిల్‌పై పెండింగ్‌లో ఉన్న చలాన్ మొత్తం అమౌంట్‌లో, డిస్కౌంట్ తర్వాత చెల్లించాల్సిన ఫైనల్ అమౌంట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆఫర్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి చలాన్స్ క్లియర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
నేడు పోలీసుల గైడ్‌లైన్స్
డిస్కౌంట్ ఆఫర్ జనవరి10వ తేదీ వరకు అమలు చేసే అవకాశం ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనదారులు అంతా ఒకేసారి ఈ చలాన్ పోర్టల్‌ను ఓపెన్ చేస్తుండటంతో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. డిస్కౌంట్ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో బుధవారం నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనాలపై పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసేంత వరకు ఆఫర్ కొనసాగించే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటికే 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా 18,33,761 హెల్మెట్ వాడని చలాన్స్ ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్ అమల్లోకి వస్తే ఈసారి పెండిగ్ చలాన్స్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.