ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ రాజకీయ నేతలు..

ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ రాజకీయ నేతలు..

తెలంగాణ రాజకీయ నేతలు ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు. అధికార బీఆర్ఎస్ తో పాటు..కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు ఏపీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఏపీలో పర్యటించారు. కోనసీమ జిల్లా  వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి వెళ్లిన  జానారెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశ్వీరచనం ఇచ్చి స్వామివారి చిత్రపటం అందజేశారు. జానారెడ్డిని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. 

కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైయస్ సమాధిని సందర్సించి నివాళులు అర్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత,  మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పూర్తవ్వడంతో తన పాదయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు.. పాల్గొన్న వ్యక్తిగత సిబ్బంది, పాదయాత్ర ఆసాంతం వివిధ విభాగాల్లో సేవలు అందించిన నాయకులు, భద్రతా సిబ్బందితో కలిసి తిరుపతికి వెళ్తున్నారు  భట్టి విక్రమార్క.  మార్గం మధ్యలో ఇడుపులపాయ వెళ్లిన భట్టి....దివంగత నేత వైఎస్ కు నివాళులు అర్పించారు. ఈసందర్బంగా  పాదయాత్రలో తనతో పాల్గొన్న   సిబ్బంది , సహచరులు తిరుపతి వెళ్ళాలని అనుకున్నామని తెలిపారు. అందులో భాగంగా దారిలో ఉన్న వైయస్ఆర్ సమాధిని కూడా దర్శించుకుని నివాళులు అర్పించాలని ఇక్కడికి వచ్చామని చెప్పారు.  తాను వైయస్ఆర్ దగ్గర మండలి సభ్యుడిగా , శాసనసభలో ఛీఫ్ విప్‌గా పనిచేశానని , వైయస్ఆర్‌తో అత్యంత సన్నిహితంగా పనిచేసే అదృష్టం తనకు కలిగిందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వైయస్ఆర్‌కు పేద ప్రజలపై , వ్యవసాయంపై , రాష్ట్ర అభివృద్దిపై ఎంతో తపన ఉండేదని, అందుకే ఆయన అనుచరుడిగా పెద్ద ఎత్తున వైయస్ఆర్‌పై మమకారం పెరిగిందన్నారు.  వైయస్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళాలన్నదే తన ఆశయం, లక్ష్యంగా భట్టి తెలిపారు. వైయస్ లాంటి నాయకుడు మన నుంచి దూరంకావడం దురదృష్టమన్న భట్టి.. అలాంటి నాయకుడిని మళ్ళీ చూడలేమన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలోని కృష్ణా జిల్లాలో పర్యటించారు. ముందుగా కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తర్వాత  విజయవాడలో ని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయా దేవాలయాల వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు.  మంత్రి, కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.