పైలట్ ప్రాజెక్టు కింద మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్

పైలట్ ప్రాజెక్టు కింద మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్

హైదరాబాద్, వెలుగు :  మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మండలానికో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘తెలంగాణ పబ్లిక్  స్కూల్’  ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఇందులో భాగంగా పైలట్  ప్రతిపాదికన ఈ స్కూళ్లను ఏర్పాటుకు రూ.500 కోట్లు పొందుపర్చారు. అలాగే విద్యా రంగానికి నిధులు కాస్తం పెంచారు. నిరుడు 6.57 శాతం నిధులు ప్రతిపాదించగా ఈసారి 7.75 శాతానికి ఆ ప్రతిపాదనలు పెరిగాయి. 2024–25 బడ్జెట్ లో రూ.21,389 కోట్లకు నిధులు ప్రతిపాదించారు. నిరుటితో పోలిస్తే నిధులు రూ.2,296 (1.18 శాతం) కోట్లు పెరిగాయి. దీంట్లో స్కూల్  ఎడ్యుకేషన్​కు రూ.17,931.42 కోట్లు, హయ్యర్  ఎడ్యుకేషన్​కు రూ.2959.10 కోట్లు, టెక్నికల్  ఎడ్యుకేషన్ కు రూ.487.64 కోట్లు ప్రతిపాదించారు. 

రాష్ర్టాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని బడ్జెట్ స్పీచ్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్​పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని ఆయన చెప్పారు. అవసరమైన నిధులను అందిస్తామని, అన్ని బడుల్లో డిజిటల్  క్లాస్ రూంలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరో పక్క యూనివర్సిటీల్లో వసతులకు నిధులు కేటాయించారు. ఓయూతో సహా అన్ని వర్సిటీల్లో ఫెసిలిటీస్  కోసం రూ.500 కోట్లను ప్రతిపాదించారు. మరోపక్క హయ్యర్ ఎడ్యుకేషన్​ కౌన్సిల్ ను పూర్తిగా ప్రక్షాళించి ఉన్నత విద్యలో ప్రమాణాలు పెరుగుపరుస్తామని సర్కారు ప్రకటించింది. 

65 ఐటీఐల అభివృద్ధికి ప్రైవేటుతో భాగస్వామ్యం

రాష్ట్రంలో టెక్నికల్  ఎడ్యుకేషన్​ను మరిం త పటిష్టంగా అమలు చేసేందుకు సర్కా రు సమాయత్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తం గా 65 ఐటీఐలను ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబో తున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని సర్కారు ప్రకటించింది. ఐటీఐల్లో కొత్త సాంకేతిక పరికరాలు అందించడంతో పాటు, వాటిని వినియోగించేందుకు అవసరమైన ట్రైనింగ్  ఇప్పిస్తామని, కొత్త కోర్సులను రూపొందిస్తామని తెలిపింది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ర్టాల్లోని స్కిల్ వర్సిటీలను అధికారుల బృందాలు ఇప్పటికే స్టడీ చేసి వచ్చాయని భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.