
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రమంతా ముసురు పట్టింది. వారం రోజులుగా రికాం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు సవ్వళ్లతో కిందకు దుంకుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ముసురుపట్టడం.. రెండు నెలల నుంచి ఇప్పుడే మంచి వర్షాలు కురుస్తుండడంతో పొలం పనులూ జోరందుకున్నాయి. ఖరీఫ్లో 80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పది లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే నాట్లు మరింత జోరందుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే, మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ముసురు పట్టే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇటు హైదరాబాద్ సిటీలోనూ మూడు రోజులుగా ముసురు ఉండడంతో ఉదయం స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. సిటీలో రోడ్లపై నీళ్లు నిలవకుండా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో భారీ మోటార్లను సిద్ధం చేసి పెడుతున్నారు. ఇక, వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతాలు అలరిస్తున్నాయి. బొగత, గుండాల, కుంటాల వంటి జలపాతాల వద్ద జలధారలు పొంగి పొర్లుతున్నాయి. వరదలు వస్తుండడంతో సేఫ్టీ దృష్ట్యా ప్రస్తుతం టూరిస్టులను జలపాతాల వద్దకు అధికారులు అనుమతించడం లేదు.
రాష్ట్రమంతా మోస్తరు వానలు..
రాష్ట్రవ్యాప్తంగా శనివారం కూడా మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారిలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మేనూరులో 6.2, నిర్మల్ జిల్లా విశ్వనాథపేటలో 5.9, రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో 4.9, నిజామాబాద్ జిల్లా తొండకూరులో 4.7, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరులో 4.5, కరీంనగర్ జిల్లా గంగిపల్లిలో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి వర్షం కురిసింది. షేక్‌పేటలో 1.9, బంజారాహిల్స్‌లో 1.7, రాజేంద్రనగర్‌లో 1.6, మైలార్‌దేవ్‌పల్లిలో 1.6, లంగర్‌హౌస్‌లో 1.5, ఖైరతాబాద్‌లో 1.5, మియాపూర్, గచ్చిబౌలి, జూపార్క్ఏరియాలో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద
ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇటు కృష్ణా బేసిన్‌తో పాటు అటు గోదావరి బేసిన్లోనూ వరద క్రమంగా పెరుగుతున్నది. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు ఇన్‌ఫ్లోస్ మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటిదాకా ఆ రెండు ప్రాజెక్టులకు 42 వేల క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లోస్ రాగా.. ప్రస్తుతం ఆల్మట్టికి 63 వేల క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 85 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతున్నది. దీంతో ఆ రెండు ప్రాజెక్టుల నుంచి 80 వేలు, 88 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వదులుతున్నారు.
జూరాలకు 75 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 83 వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. తుంగభద్రలోనూ వరద పెరిగింది. 76 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 86 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ఇటు తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 1.54 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.