సూర్యాపేట, వెలుగు: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ సూర్యాపేట కోర్టు చౌరస్తా నుండి కుడకుడ రోడ్డు వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌చేశారు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ప్రజల గురించి పట్టించుకోలేదని తెలిపారు. రెండుసార్లు మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడు కూడా రోడ్ల గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న సూర్యాపేట రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజల్ని పట్టించుకునే ప్రభుత్వం రాదు అని కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ స్పందించి రోడ్ల సమస్యను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, చాంద్ పాషా, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి రాజేశ్, కుంభం నాగరాజు, ఉప్పల మల్లయ్య, బొల్లె సైదులు, ఆవుల అంజయ్య, మధు, పల్స నగేష్, రమేష్ యాదవ్ పాల్గొన్నారు.
