
పోయినేడాది ప్రాణం తీసుకున్న 499 మంది
దేశమంతటా 10,281 మంది రైతులు, కూలీల ఆత్మహత్యలు
3,927 ఆత్మహత్యలతో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్
ఎన్సీఆర్బీ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం ఐదో ప్లేస్‌లో నిలిచింది. పోయినేడాది 499 మంది రైతులు, రైతుకూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో సొంత భూమి ఉన్న రైతులు 373 మంది కాగా.. వీరిలో మహిళా రైతులు 41 మంది, మగవాళ్లు 332 మంది ఉన్నారు. ఇక118 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా వారిలో 102 మంది మగవాళ్లు, 16 మంది మహిళా రైతులున్నారు. 8 మంది రైతు కూలీలు చనిపోయారు. దేశంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది.
మహారాష్ట్ర ఫస్ట్
దేశమంతటా 10,281 రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ రిపోర్ట్ పేర్కొంది. 3,927 రైతు ఆత్మహత్యలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మొత్తం ఆత్మహత్యల్లో ఆ రాష్ట్రం వాటానే 38 శాతం కావడం గమనార్హం. ఆ తర్వాత కర్నాటక రెండో స్థానంలో ఉంది. అక్కడ 1,992 మంది రైతులు ఉసురు తీసుకున్నారు. 1,029 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 541 రైతు ఆత్మహత్యలతో మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఆత్మహత్యలు తగ్గినా.. నివారించలే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆత్మహత్యలు తగ్గినా.. వాటిని మాత్రం నివారించలేకపోయారని ఎన్సీఆర్బీ రిపోర్ట్ పేర్కొంది. అయితే, ఇది ఆందోళన కలిగించే విషయమని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విధానాలను మార్చి రైతుల దుస్థితిని నివారించాలని అంటున్నారు. స్వామినాథన్ కమిషన్ సూచించినట్టు సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2)కు 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, అది రైతులకు హక్కుగా లభించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులను అప్పుల నుంచి విముక్తి చేయాలన్న డిమాండ్ కూడా వస్తోంది.
For More News..