సబ్సిడీల ఖర్చులో తెలంగాణ టాప్..తగ్గించుకోవాలని హెచ్చరిక

సబ్సిడీల ఖర్చులో తెలంగాణ టాప్..తగ్గించుకోవాలని హెచ్చరిక
  •  
  • ఒక్కో వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం రూ. 16,460 
  • పరిమితికి మించిన సబ్సిడీలు, డిస్కంల నష్టాలపై 16వ ఆర్థిక సంఘం రిపోర్ట్‌‌
  • దేశ సగటు కంటే ఎక్కువ.. తగ్గించుకోవాలని హెచ్చరిక
  • రాబోయే ఐదేండ్లలో ఆర్థిక క్రమశిక్షణ  పాటించకపోతే గ్రాంట్లపై ఆంక్షలు 
  • అర్హులకే స్కీమ్‌‌లు, నగదు బదిలీ అందేలా గైడ్​లైన్స్​ ఉండాలని సూచన

హైదరాబాద్​, వెలుగు:  దేశవ్యాప్తంగా సాగుతున్న ఉచితాల పందేరంలో తెలంగాణ  అందరికంటే ముందు వరుసలో నిలిచింది. ‘తలసరి సబ్సిడీ’ లెక్కల్లో  దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది.  రాష్ట్రంలో తలసరి సబ్సిడీ వ్యయం (ఒక్కో వ్యక్తిపై ప్రభుత్వం చేస్తున్న సబ్సిడీ ఖర్చు) ఏకంగా రూ. 16,460గా ఉన్నదని, ఇది దేశ సగటు కంటే చాలా ఎక్కువని 16వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తున్న ఉచిత పథకాలు, సబ్సిడీల లెక్కలను ఈ రిపోర్ట్​ బయటపెట్టింది.  తెలంగాణ ఖర్చు చేస్తున్న సబ్సిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఆర్థిక సంఘం అస్సాం రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకున్నది. అస్సాంలో తలసరి సబ్సిడీ కేవలం రూ. 1,707 మాత్రమే. అంటే అస్సాంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం తన ప్రజల కోసం సబ్సిడీల రూపంలో చేస్తున్న ఖర్చు దాదాపు 9 రెట్లు ఎక్కువ. ఈ స్థాయిలో నగదు బదిలీలు, సబ్సిడీలు ఇస్తుండటం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం ఆర్థిక సుస్థిరత దెబ్బతింటుందని ఆర్థిక సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ తర్వాత అత్యధిక సబ్సిడీలు ఇస్తున్న రాష్ట్రాల జాబితాలో చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, ఏపీ నిలిచాయి.  ఇలా సబ్సిడీలకే నిధులన్నీ ఖర్చు చేస్తే.. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణంలాంటి మౌలిక వసతుల  మాటేమిటని ఆర్థిక సంఘం ప్రశ్నించింది. ఆదాయంలో సింహభాగం ఇలాంటి పథకాలకే పోతే.. దీర్ఘకాలికంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయని, ఇది  ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించింది. వెంటనే అర్హుల జాబితాను సమీక్షించుకుని, సబ్సిడీలను హేతుబద్ధీకరించుకోవాలని సూచించింది.

రైతుబంధు..పెన్షన్లకే ఎక్కువ..

ఎలాంటి షరతులు లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసే పథకాలే  రాష్ట్రాల ఖజానాను ఖాళీ చేస్తున్నాయని ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. 2018-–19లో రూ. 73,099 కోట్లుగా ఉన్న ఇలాంటి బదిలీలు.. 2025–-26 నాటికి రూ. 4.14 లక్షల కోట్లకు చేరతాయని అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణలోని రైతుబంధు, పెన్షన్‌‌‌‌‌‌‌‌లాంటి పథకాలు ఈ కోవకే చెందుతాయని పేర్కొన్నది. వ్యవసాయ సబ్సిడీలు (రైతుబంధులాంటివి), సామాజిక భద్రతా పెన్షన్ల కోసం రాష్ట్రం తన మొత్తం రెవెన్యూ రాబడిలో గణనీయమైన వాటాను ఖర్చు చేస్తున్నదని గణాంకాలతో సహా వెల్లడించింది. 2023-–24లో దాదాపు రూ. 15,267 కోట్లు వ్యవసాయ సబ్సిడీలకే (క్యాష్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్) వెచ్చించిందని పేర్కొన్నది.  ఎలాంటి షరతులు లేని నగదు బదిలీ పథకాలు  రాష్ట్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌పై తీవ్ర భారం మోపుతున్నాయని, వీటిని పునఃసమీక్షించుకోవాలని సూచించింది. కేవలం విద్యుత్ రంగానికి సంబంధించిన సబ్సిడీలను పరిశీలిస్తే.. పంజాబ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. 2023–-24లో పంజాబ్‌‌‌‌‌‌‌‌లో తలసరి విద్యుత్ సబ్సిడీ రూ. 5,893గా ఉంది. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో తలసరి విద్యుత్ సబ్సిడీ రూ. 4,195గా ఉండగా, తమిళనాడులో రూ. 4,169గా నమోదైంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహాలకు రాయితీ విద్యుత్ పథకాలే ఇందుకు ప్రధాన కారణం. డిస్కంల ఆర్థిక ఆరోగ్యం క్షీణించడం వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతున్నదని ఆర్థిక సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నష్టాలను భర్తీ చేసేందుకు, విద్యుత్ సరఫరాను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఏకంగా  రూ. 9,382 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించిందని అభిప్రాయపడింది. 

పేద రాష్ట్రాల్లో తక్కువ..  ధనిక రాష్ట్రాల్లో ఎక్కువ

సాధారణంగా పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సబ్సిడీలు ఎక్కువగా ఉండాలి.. కానీ, దేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని ఆర్థిక సంఘం విశ్లేషించింది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ధనిక రాష్ట్రాలే సబ్సిడీ లను ఎక్కువగా కుమ్మరిస్తున్నాయని పేర్కొన్నది. ఉదాహరణకు తలసరి ఆదాయం తక్కువగా ఉన్న బిహార్, యూపీ రాష్ట్రాల్లో తలసరి సబ్సిడీ చాలా తక్కువగా ఉంది. కానీ, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న తెలంగాణ, గోవాలాంటి రాష్ట్రాలు మాత్రం సబ్సిడీల పంపిణీలో టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. అంటే.. ‘‘అవసరం ఉన్న చోట కంటే, ఆర్థిక స్తోమత ఉన్న చోటే ఉచితాలు ఎక్కువగా అందుతున్నా యి’’ అని ఆర్థిక సంఘం పేర్కొన్నది.