14.9%తో జీఎస్‌డీపీలో మనమే టాప్

14.9%తో జీఎస్‌డీపీలో మనమే టాప్
  • హెల్త్​లో రాష్ట్రానికి మూడో ప్లేస్
  • స్టార్టప్స్​లో ఐదో  ప్లేస్
  • 2016 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,080 స్టార్టప్​లు
  • మార్కెటింగ్​లో తొమ్మిదో ర్యాంకు
  • ఓడీఎఫ్​లో మాత్రం వెనుకంజ
  • కేంద్ర ఎకనామిక్​ సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక వృద్ధి రేటులో రాష్ట్రం దూసుకుపోతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో జీఎస్​డీపీ (గ్రాస్​ స్టేట్​ డొమెస్టిక్​ ప్రొడక్ట్​)లో తెలంగాణ 14.9% వృద్ధి సాధించి దేశంలోనే నంబర్​ వన్​ స్థానంలో నిలిచింది. గురువారం పార్లమెంట్​లో ఫైనాన్స్​ మినిస్టర్​  నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన ఎకనామిక్​ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఫస్ట్​ ప్లేస్​లో తెలంగాణ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో కర్నాటక(13.9%), ఢిల్లీ (13.2%), తమిళనాడు(12.6%) నిలిచాయి. అయితే ఈ రిపోర్టులో 11 రాష్ట్రాల జీఎస్‌‌డీపీ వివరాలను మాత్రమే కేంద్రం పొందుపరిచింది. 18 రాష్ట్రాల వివరాలు అందుబాటులో లేవని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) 7 శాతానికి నమోదయ్యే అవకాశం ఉందని ఎకనామిక్​ సర్వే అంచనా వేసింది. 2024 నాటికి దేశ ఎకానమీ సైజ్​ 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది సాధించాలంటే జీడీపీ రేటు 8 శాతానికి చేరుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.  కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్రో ధరలు తగ్గుతాయని ఎకనామిక్​ సర్వే అంచనా వేసింది.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి..

ఐదేండ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు అంతంతమాత్రంగానే ఉన్న జీఎస్​డీపీ  క్రమేణా పెరుగుతూ వస్తోంది. 2014–-15లో  11.8శాతంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు.. 2015-–16లో 14.6 శాతంగా నమోదైంది. అటు తర్వాత 2016-–17లో 14.8శాతం నమోదై.. 2017‌‌‌‌–18 వచ్చేసరికి కొద్దిగా తగ్గి 14.3శాతానికి చేరుకుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే జీఎస్​డీపీ రేటు భారీ స్థాయిలో పెరిగింది. 14.9 శాతంతో దేశంలోనే టాప్​ ప్లేస్​ను రాష్ట్రం ఆక్రమించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 0.6శాతం అదనం.

ఓడీఎఫ్‌‌లో కింది నుంచి మూడో స్థానం

ఆరుబయట మల, మూత్ర విసర్జన నిరోధించడంతోపాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌‌ మిషన్‌‌లో భాగంగా ఇండివిడ్యువల్‌‌ హౌస్‌‌హోల్డ్‌‌ లెట్రిన్‌‌(ఐహెచ్‌‌హెచ్‌‌ఎల్‌‌) పథకాన్ని గతంలో ప్రవేశపెట్టింది. శానిటేషన్‌‌ సరిగ్గా లేని ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారని పలు సర్వేల్లో తేలింది.  దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలను ఓపెన్‌‌ డెఫికేషన్‌‌ ఫ్రీ(ఓడీఎఫ్‌‌) రాష్ట్రాలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఐహెచ్‌‌హెచ్‌‌ఎల్‌‌ స్కీమ్‌‌ను అమలు చేస్తోంది. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్‌‌ 2న ఈ పథకాన్ని ప్రారంభిస్తూ 2019 అక్టోబర్‌‌ 2 వరకు ఓడీఎఫ్‌‌ ఇండియాగా ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. 24 రాష్ట్రాలు 100 శాతం లక్ష్యాన్ని సాధించాయి.  పశ్చిమ బెంగాల్‌‌ 99.55 శాతం, సిక్కిం 97.06 శాతం పూర్తి చేశాయి. ఐహెచ్‌‌హెచ్‌‌ఎల్‌‌ స్కీమ్‌‌ అమలులో వెనుకబడిన నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.  గోవా 5.8 శాతంతో అట్టడుగు స్థాయిలో ఉండగా, కింది నుంచి రెండో స్థానంలో ఒడిశా(45.36), మూడో స్థానంలో తెలంగాణ(73.99),  నాలుగో స్థానంలో బీహార్‌‌(82.95) ఉన్నాయి. తెలంగాణలో 26 శాతం గ్రామాలు, పట్టణాలు ఓడీఎఫ్‌‌ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది.

గ్రామీణ రోడ్లు 75 వేల కిలోమీటర్లు

అత్యధిక కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర నమోదైంది. ఈ రాష్ట్రం 4.20 లక్షల కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి వరుస ఏడు స్థానాల్లో అసోం (3 లక్షల కి.మీ.), ఉత్తరప్రదేశ్‌‌(2.50 లక్షల కి.మీ.), ఒడిశా(2.40 లక్షల కి.మీ.), మధ్యప్రదేశ్‌‌(2.40 లక్షల కి.మీ.), కర్నాటక(2.20 లక్షల కి.మీ.), పశ్చిమ బెంగాల్(2 లక్షల కి.మీ.) ఉన్నాయి. 75 వేల కిలోమీటర్లతో  తెలంగాణ 15వ స్థానంలో ఉంది.  ఇదిలా ఉంటే.. మార్కెటింగ్‌‌, రైతుకు లబ్ధి చేకూర్చే సంస్కరణల ర్యాంకింగ్స్​లో తెలంగాణకు తొమ్మిదో స్థానం దక్కింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో గుజరాత్​ ఉండగా.. ఆంధ్రప్రదేశ్​ ఏడో స్థానంలో నిలిచింది.

స్టార్టప్స్‌‌‌‌లో ఐదో స్థానం

స్టార్టప్‌‌‌‌ ఇండియా స్కీమ్‌‌‌‌ కింద 2016నుంచి ఇప్పటి వరకు ఔత్సాహి క యువతదేశవ్యాప్తంగా 19,351 కొత్త కంపెనీలుప్రారంభిం చారు. వీటిలో తెలంగాణవి1080 ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసిన-ప్పుడు మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది.3,661 కంపెనీలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 2,847 కంపెనీలతో కర్నాటక రెండో స్థానంలో, 2,552 కంపెనీలతో ఢిల్లీ మూడో స్థానంలో, 1,566 కంపెనీలతో ఉత్తర ప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి.