
Auto Industry: కొన్ని నెలలుగా భారతదేశంలోని ఆటో రంగం పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. చాలా సంస్థలు తమ కార్ల ఉత్పత్తిని పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాయి. దీనికి కారణం చైనా ప్రభుత్వ నిర్ణయాలే. ఇప్పటికే అరుదైన ఎత్త్ అయస్కాంతాల ఎగుమతులను తగ్గించిన చైనా.. ఇతర భాగాల ఎగుమతుల్లో కూడా కోతలు ప్రకటించింది. దీంతో కార్ల అమ్మకాలు కూడా దెబ్బతిన్నట్లు జూన్ డేటా చెబుతోంది.
గడచిన నెలలో భారత ఆటో రంగం భారీగా తగ్గిన అమ్మకాలను చూసింది. మెుదటి స్థానంలో ఉన్న మారుతీ జూన్ నెలలో లక్ష 19వేల వాహనాలను అమ్మగా మే కంటే 18వేల తక్కువ యూనిట్లను అమ్మగలిగింది. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా 47వేల వాహనాలను విక్రయించగా.. హుందాయ్ 44వేల వాహనాలు, టాటా మోటార్స్ 37వేల యూనిట్లను సేల్ చేసాయి. ఇక చివరిగా టయోటా 29వేల వరకు వాహనాలను విక్రయించగలిగింది. ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా మినహా మిగిలిన సంస్థలు నెలవారీ తగ్గిన అమ్మకాలను చూశాయి.
చైనా తీసుకున్న నిర్ణయం కారణంగా సుజుకీ తన స్విఫ్ట్ కార్ల తయారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో భారత టూవీలర్ తయారీ సంస్థలు కూడా సమస్యకు పరిష్కారాలను కనుగొనాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. చైనా ఎర్త్ మ్యాగ్నెట్ల ఎగుమతిని నిలిపివేయటం వల్ల రానున్న కాలంలో ఆటో దిగ్గజాలు కొన్ని మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఉత్పత్తి తగ్గించటంతో పాటు ధరలను పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కంపెనీలతో పాటు కొనుగోలుదారులపై భారంగా మారనుంది.