
- 20,865 కేసులతో సౌత్‌లో తెలంగాణ టాప్
- 99.5 శాతం కేసుల్లో తెలిసినోళ్ల నుంచే ముప్పు
- క్రైమ్ ఇన్ ఇండియా నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలపై దాడు లు ఏటా పెరుగుతున్నాయి. నిరుడు రోజుకు సగటున 57 అఘాయిత్యాలు జరిగాయి. అంతకుముందు మూడేండ్లతో పోలిస్తే 2021లో అత్యాచారాలు, దాడులు భారీగా పెరిగాయి. 20 వేలకు పైగా కేసులతో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్బీ) విడుదల చేసిన క్రైమ్స్ ఇన్ ఇండియా (సీఐఐ) రిపోర్టులో వెల్లడయ్యాయి. ఎన్‌సీఆర్బీ నివేదిక ప్రకా రం 2020లో రాష్ట్రంలో మహిళలపై హింసకు సంబంధించిన కేసుల సంఖ్య 17,791 కాగా, 2021లో 20,865(17.2శాతం)కి పెరి గింది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్(17,752 కేసులు), కర్నాటక (14,468), కేర ళ(13,539), తమిళనాడు (8,501 కేసులు) రాష్ట్రాలున్నాయి.
ఎక్కువగా వేధిస్తున్నది.. భర్త, బంధువులే
మహిళలపై హింసకు సంబంధించిన మొత్తం 20,865 కేసుల్లో 9,468 నేరాల్లో భర్త, బంధువులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో జరిగిన 823 రేప్ కేసులకుగాను 501 కేసుల్లో బాధితుల ఫ్రెండ్స్, ఆన్లైన్లో పరిచయమైనవాళ్లు, సహజీవనం చేస్తున్నోళ్లు, విడాకులు తీసుకుని సింగిల్‌గా ఉంటున్న మగవాళ్లున్నారు. 129 ఘటనల్లో కుటుంబ సభ్యులు, 189 కేసుల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్, కొలిగ్స్ నిందితులుగా ఉన్నారు. రేప్ కేసుల్లో 99.5 శాతం మంది నిందితులు బాధితులకు తెలిసినవారే కావడం గమనార్హం. 4కేసుల్లో మాత్రమే నిందితులు బాధితులకు పూర్తిగా అపరిచితులని ఎన్‌సీఆర్బీ రిపోర్ట్ వెల్లడించింది. చిన్నారులపై 1,835 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
1967 కిడ్నాప్ కేసులు
రాష్ట్రంలో నిరుడు 1,967 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 330 కేసుల్లో బాధితులను బలవంతంగా పెండ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్లోనూ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. మొత్తం 123 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు కాగా, వివిధ ప్రాంతాల నుంచి 221 మంది బాధితులను రక్షించారు. మహిళలపై జరిగిన ఇతర నేరాల్లో 12 రేప్ అండ్ మర్డర్ కేసులు, 175 వరకట్న మరణాలు, 403 ఆత్మహత్యకు ప్రేరేపించినవి, ఒక్కో కేసు చొప్పున యాసిడ్ దాడి, యాసిడ్ దాడికి యత్నం కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా అడ్డాగా వేధింపులు దేశవ్యాప్తంగా 52,430 సైబర్ నేరాలు నమోదైతే వాటిలో దాదాపు 20% తెలంగాణలోనే కావడం గమనార్హం. సోషల్ మీడియా, ఇంటర్నెట్లో మహి ళలే టార్గెట్‌గా వేధించిన ఘటనలపై 47 సైబర్ నేరాలు నమోదయ్యాయి.