
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో (RFCL)లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్ కుమార్ వెల్లడించారు. సుమారు 300 మంది దగ్గర నిందితులు రూ. 14 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకున్న దళారులు తిరిగి ఇవ్వకపోవడంతో ముంజ హరీష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. హరీష్ ఆత్మహత్యకు కారణమైన సూపర్ వైజర్ చిలకపల్లి సతీష్, సబ్ కాంట్రాక్టర్లు గుండు రాజు, గోపగోని మోహన్ గౌడ్, పాలకుర్తి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతి గౌడ్ పై కేసులు నమోదు చేశామని చెప్పారు. నలుగురిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, RFCL బాధితులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
అంతకుముందు.. RFCL బాధితుడు హరీశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. మృతదేహంతో పోస్టుమార్టం గది ముందు ఆందోళన చేశారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో హరీశ్ మృతదేహాన్ని కేశవపట్నం మండలంలోని స్వగ్రామమైన అమ్మలపురంకు తీసుకెళ్లారు. హరీష్ తండ్రి ఫిర్యాదు మేరకు కమాన్ పూర్ స్టేషన్ లో 306, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.