V6 News

Telangana Rising Global Summit 2025: స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేయండి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు!

Telangana Rising Global Summit 2025:  స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేయండి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025'లో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ పెద్దలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నటి జెనీలియా, అక్కినేని అమలతో పాటు పలువురు ముఖ్యులు పాల్గొన్నారు. ఈ భేటీలో చిరంజీవి, అజయ్ దేవగణ్ వంటి అగ్ర ప్రముఖులు కూడా పాల్గొనడం చర్చనీయాంశమైంది.

సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీలు

రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి, ప్రోత్సాహానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పరిశ్రమకు పలు కీలక హామీలు ఇచ్చారు. కేవలం స్క్రిప్ట్‌తో తెలంగాణకు వస్తే, సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా అన్ని రకాల సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభతరం చేస్తామని భరోసా ఇచ్చారు.

ALSO READ : Telangana Global Summit :రెండు రోజుల్లో 5 లక్షల 39 వేల 495 కోట్ల పెట్టుబడులు

 ఫ్యూచర్ సిటీలో కొత్త స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించిన సీఎం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా 24 క్రాఫ్ట్స్‌లో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సినీ ప్రముఖులను కోరారు. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

చిరంజీవి, అజయ్ దేవగణ్ హాజరు

 ఈ ఉన్నత స్థాయి సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ ,రితేష్ దేశ్ ముఖ్,  అర్జున్ కపూర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.  తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు  ప్రాధాన్యతను  ఇస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది..

 

 సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సినీ పెద్దల భాగస్వామ్యంతో ఇండస్ట్రీ సమస్యలు, వృద్ధిపై సానుకూల చర్చ జరిగాయి..  తెలంగాణ ప్రభుత్వం సినీ రంగానికి మరింత అండగా ఉంటుందనే స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో టాలీవుడ్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ హామీల అమలుతో తెలంగాణలో సినీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందంటున్నారు సినీ పరిశ్రమ వర్గాలు..