- 2 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు
- తొలిరోజు రెండేండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్‌ల ప్రదర్శన
- రెండో రోజు ‘తెలంగాణ రైజింగ్ –2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణ
- సమిట్ నిర్వహణలో చిన్న లోపం కూడా ఉండొద్దు.. అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర భవిష్యత్తు చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ‘తెలంగాణ రైజింగ్ – 2047’ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ వేడకలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం సీఎంవో అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రగతిని, భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించేలా సువిశాలమైన ప్రాంగణంలో భారీ వేదికను సిద్ధం చేయాలని.. ఈ వేడుకలు దేశం మొత్తం చూసేలా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న ఈ సమిట్‌కు దేశ విదేశాల నుంచి దాదాపు 2 వేల మంది ప్రముఖులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ వేడుకల్లో ఎక్కడా చిన్న లోపం కూడా దొర్లకుండా పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సమిట్ ఏర్పాట్లు కేవలం ఒక సభలా కాకుండా, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే ఒక పండుగలా జరగాలని సూచించారు. వచ్చే అతిథులకు అత్యున్నత స్థాయి వసతి సదుపాయాలతో పాటు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. సమీక్షా సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులతో సమావేశాలు
రెండు రోజుల సమిట్‌లో భాగంగా.. డిసెంబర్ 8న తొలి రోజు గడిచిన రెండేండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రదర్శించనున్నారు. ప్రజాపాలనలో వచ్చిన మార్పులను, ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించనున్నారు. డిసెంబర్ 9న రెండో రోజు అత్యంత కీలకమైన ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు, రాబోయే 25 ఏండ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించే దార్శనికత ఈ డాక్యుమెంట్‌లో ప్రధానాంశంగా ఉంటుంది.
ఇదే వేదికపై రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఆ దిశగా అన్ని ప్రభుత్వ విభాగాలను సన్నద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి శాఖ భవిష్యత్తు లక్ష్యాలను, ప్రణాళికలను వివరించేలా ప్రజంటేషన్లను తయారు చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
గ్లోబల్ సమిట్‌లో ప్రతి విభాగం తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలని, లక్ష్యాలను చేరుకునే మార్గాలపైనా లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు తెలంగాణ సత్తాను చాటేలా ఈ ప్రజంటేషన్లు ఉండాలని, తద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక పాలసీలను సైతం ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
25 నుంచి సీఎం వరుస సమీక్షలు
‘తెలంగాణ రైజింగ్ – 2047’ డాక్యుమెంట్‌కు తుది మెరుగులు దిద్దే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలు, వివిధ రంగాల నిపుణులు అందించిన సలహాలు, సూచనలతో ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ అయింది. అయితే, దీన్ని మరింత పదును పెట్టేందుకు ఈ నెల 25 నుంచి సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖలతో వరుస సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు.
అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రంగాలు, వాటి అనుబంధ విభాగాలతో వేర్వేరుగా సమావేశమై.. డాక్యుమెంట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమీక్షల్లో వచ్చే నిర్దిష్టమైన సూచనలను పరిగణనలోకి తీసుకుని డాక్యుమెంట్‌కు తుది రూపం ఇవ్వనున్నారు. నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే శాఖలవారీ సమీక్షల్లో కేవలం సమిట్ ఏర్పాట్లపైనే కాకుండా, రెండేండ్ల ప్రగతి నివేదికపైనా సీఎం ఆరా తీయనున్నారు. రాబోయే కాలంలో తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ రూపొందుతున్నది.
