
- వచ్చే మూడేండ్లలో రోడ్ల రిపేర్లు: మంత్రి వెంకట్రెడ్డి
- గుంతలు లేని రోడ్లు, రూరల్ అర్బన్కనెక్టివిటీ లక్ష్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎక్కువ డ్యామేజ్ అయిన, ప్రయాణానికి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న రోడ్లకు హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటీ మోడల్)లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశించారు. గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను పట్టించుకోకపోవటంతో గుంతల రోడ్లతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రిపేర్లు చేశామన్నారు. మూడేండ్లలో రోడ్ల రిపేర్లన్ని పూర్తి చేస్తామన్నారు.
సోమవారం సెక్రటేరియెట్ లో హ్యామ్ రోడ్లపై అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు. హ్యామ్ ఫేజ్-1లో 5,189 కిలోమీటర్ల రోడ్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశామని మంత్రికి అధికారులు తెలిపారు. త్వరలో డీపీఆర్ లు, రిపేర్లకు అయ్యే నిధుల వివరాలు ఖరారు చేయాలని కన్సల్టెన్సీని మంత్రి ఆదేశించారు. హ్యామ్ రోడ్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు ప్రపోజల్స్ ను మంత్రికి వివరించారు. అనంతరం నేషనల్ హైవే అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు.
రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నార్త్ పార్ట్ కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలని (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలో జరగనున్న ఎన్ హెచ్ 2025–26 ప్లాన్ కు రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ రెడీ చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత హ్యామ్ రోడ్లపై సమగ్ర సమీక్ష చేసి.. కేబినెట్ ఆమోదం కోసం ప్రపోజల్స్ అందజేస్తామని వెంకట్రెడ్డి తెలిపారు. అనంతరం పనులు వెంటనే ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. పాట్ హోల్స్ లేని, సురక్షితమైన రోడ్లు, రూరల్ అర్బన్ ప్రాంతాల కనెక్టివిటీని మరింత పెంచటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ- నగర ప్రాంతాల అనుసంధానం.ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు.