బస్ టికెట్‌తో పాటే దర్శనం టికెట్‌

బస్ టికెట్‌తో పాటే దర్శనం టికెట్‌

రాష్ట్రం నుండి తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. తిరుమలకు వెళ్లే వారికి బస్ టికెట్‌తోపాటే దర్శనం టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ మేరకు టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ్టి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఒ ప్రకటనలో తెలిపారు. 

శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రతి రోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. తిరుమలకు బస్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే ఈ టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా కానీ, లేదంటే అధీకృత డీలర్ వద్ద నుంచి కానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు సజ్జనార్. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.