దసరా పండుగ వేళ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్తుండటంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులను రోడ్డెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడైంది. అక్టోబర్ 5 ఉదయం 5 గంటల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్న కారణంగా… ఆసక్తిగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు దగ్గర్లోని డిపోల్లో కానీ.. మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్లను గానీ సంప్రదించాలని పలు రీజియన్లలో ఆర్టీసీ మేనేజర్లు ప్రకటన విడుదల చేశారు.
దసరా సందర్భంగా గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే ప్రజలకోసం.. బస్సులు నడిపేందుకు రంగారెడ్డి రీజియన్ లోని హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, పికెట్, పరిగి, తాండూరు, వికారాబాద్ డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా తీసుకోవాలని నిర్ణయించామని రంగారెడ్డిరీజియన్ మేనేజర్ ప్రకటన చేశారు.
ఇందుకు కొన్ని అర్హతలను ఆర్టీసీ తమ ప్రకటనలో సూచించింది.
1.డ్రైవర్లు 18నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్స్ , బ్యాడ్జ్ కలిగి ఉండాలి.
2. కండక్టర్ గా పనిచేయాలనుకునేవాళ్లు.. తమ SSC(టెన్త్) సర్టిఫికెట్ తో డిపో మేనేజర్లకు సంప్రదించాలి.
3. డ్రైవర్లు, కండక్టర్లు ఒకరోజుకు ఒక పల్లెవెలుగు బస్సుకు రూ.4వేలు, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.5వేలు ఆర్టీసీకి చెల్లించి ఎక్కువగా వచ్చిన ఆదాయన్ని రెమ్యూనరేషన్ గా తీసుకోవాలి.
4. సమ్మె కాలంలో పనిచేసిన డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ సంస్థలో మున్ముందు జరిగే రిక్రూట్ మెంట్ లో వెయిటేజీ ఉంటుంది. సమ్మె కాలంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం.
అని ఆర్టీసీ సంస్థ పలు డిపోల్లో ప్రకటనలు విడుదలచేసింది.

