సర్కార్ వేధిస్తోందని వారిలో పెరుగుతున్న అభద్రత
సీఎం వ్యాఖ్యలు బాధపెడుతున్నయి
చాలా శాఖల ఉద్యోగులపై పనిఒత్తిడి ఉంది. ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. పనిభారం పెరిగింది. ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాలు ఎక్కువయ్యాయి. మంచిగా పనిచేస్తే ప్రశంసలు, చిన్న తప్పు జరిగితే వేటు వేస్తామనడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాలకు బదిలీ చేసిన ఉద్యోగులను ఇంత వరకు పాత స్థానాలకు బదిలీ చేయలేదు. గతంలో రెండు, మూడు నెలల్లో ఈ పక్రియ పూర్తయ్యేది. పలుసార్లు సీఎం చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఉద్యోగులు బాధపడుతున్నారు. శాఖల తొలగింపు అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి.
– కారం రవీందర్ రెడ్డి , టీఎన్జీవో అధ్యక్షుడు
త్యాగాల పునాదులపై రాజ్యమేలుతున్నడు..
సీఎం కేసీఆర్ గతాన్ని మరిచిపోయిండు. ఉద్యోగులు, కార్మికులు, స్టూడెంట్స్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతోనే తెలంగాణ వచ్చింది. సబ్బండ వర్గాలు కలిసి తెలంగాణను సాధించుకున్నయి. ఎందరో అమరులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అమరుల త్యాగాల పునాదులపై కేసీఆర్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుని, రాజ్యమేలుతున్నడు. నాటి ఆప్తులు.. ఇప్పుడు శత్రువులయ్యారా..? ఉద్యోగులు, కార్మికులను సీఎం అభద్రతా భావానికి గురిచేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బెదిరింపులకు భయపడేవారేవరు లేరు.
– అశ్వత్థామరెడ్డి, ప్రధాన కార్యదర్శి, టీఎంయూ
హైదరాబాద్, వెలుగు:
‘‘మన ఆర్టీసీ కార్మికుల కాలికి ముళ్లు గుచ్చితే పంటితో తీయాలె. వాళ్లకు రక్షణ కవచంలా నిలవాలె.’’
‘‘రెవెన్యూ ఉద్యోగులు రేయింబవళ్లు పని చేసి భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు. ఇంతటి అంకితభావం, విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు ఉండడం తెలంగాణ ప్రజలు, రైతుల అదృష్టం.’’
‘‘1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలోనూ టీఎన్జీవోలు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు పెట్టినా వెనక్కి తగ్గకుండా రాష్ట్రం కోసం పోరాడిన ఘన చరిత్ర వాళ్లది’’
– ఇవి సీఎం కేసీఆర్ ఒకప్పటి మాటలు. సర్కారు ఉద్యోగులు, కార్మికులను ఉద్దేశించి ఆయన లెక్క లేనన్ని సార్లు పొగడ్తలతో ముంచెత్తారు. ఉద్యమ సమయంలోనైతే ఆకాశానికెత్తారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. కేసీఆర్ మాటల తీరు మారింది. ఇప్పుడు ఉద్యోగుల పేరెత్తితే చాలు కస్సుమంటున్నారని, జనంలో చులకన చేసి మాట్లాడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీ, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతోపాటు ప్రభుత్వ టీచర్లను కూడా సీఎం టార్గెట్ చేస్తున్నారని, దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదని చెప్తున్నారు. ఉద్యమ సమయంలో ఉపయోగించుకొని.. ఫస్ట్ టర్మ్ పాలనలో రేయింబవళ్లు పనులు చేయించుకొని.. ఇప్పుడిలా వ్యవహరించడం ఏమిటని నిలదీస్తున్నారు.
ఐఆర్, పీఆర్సీ అడిగినందుకు..!
ఉద్యమ సమయంలో ఉద్యోగుల, టీచర్లకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. జీతాలు పెంచుతామని, కుటుంబాల్లో వెలుగు నింపుతామన్న కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోవడమే మానేశారని ఏ నలుగురు ఉద్యోగులు కలిసినా చర్చించుకుంటున్నారు. ఐఆర్, పీఆర్సీ కోసం చాలా కాలంగా ఎదురుచూసిన తాము దీనిపై బహిరంగంగా ప్రశ్నించినందుకే కేసీఆర్‌కు కోపం వచ్చి ఉంటుందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు కొందరు టీచర్లు పీఆర్సీ కోసం ఆందోళన చేశారు. వారిపై ప్రభుత్వ పెద్దలు ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ‘‘తలకు మాసిననోడు కూడా ఒక సంఘం పెడ్తడు. టీచర్లకు ఇన్ని సంఘాలు ఎందుకు? రెండు, మూడుంటే సాలవా? బెదిరిస్తే బెదిరిపోతమా’’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీచర్లలో అసంతృప్తి రేకెత్తించాయి.
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఉద్యోగులపై..
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టగా రెవెన్యూ ఉద్యోగులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ సందర్భంలో (2018 ఫిబ్రవరి 24న) వాళ్లకు ప్రభుత్వం నెల జీతం బోనస్‌గా ప్రకటించింది. ‘‘ఇంత చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన ఉద్యోగులు ఉండడం తెలంగాణ ప్రజలు, రైతుల అదృష్టం. రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు కృతజ్ఞతలు’’ అని కేసీఆర్ కితాబునిచ్చారు. కానీ ఆయన ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ‘‘చట్టాలు రూపొందించేది ఉద్యోగులు కాదు. వాళ్లు ప్రభుత్వం చెప్పిన పని మాత్రమే చేయాలి. కుక్క.. తోకను ఊపుతుందా!? తోక.. కుక్కను ఊపుతుందా!? ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిర్దేశించే పరిస్థితి ఉండొద్దు. వీఆర్వోలు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ’’ అని కామెంట్ చేశారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఉద్యోగుల అనంతరం ప్రభుత్వం వీఆర్వోలు, వీఆర్‌ఏల మీద దృష్టి సారించింది. గ్రామాల్లో అన్ని సమస్యలకు వారే కారణం అన్నట్లు వ్యవహరించింది. ఊళ్లలో పరిశుభ్రత లేకపోయినా, మొక్కలు నాటకపోయినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉద్యోగాలు ఊడుతాయని చెప్పింది. ఇందుకోసం కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తూ కొత్త చట్టం చేస్తున్నమని చెప్పింది. హరితహారం, యాక్షన్ ప్లాన్ అమలులో నిర్లక్ష్యం వహించారంటూ మూడు నుంచి నాలుగు వందల మంది విలేజీ కార్యదర్శులపై చర్చలు తీసుకుంది. పని భారం భరించలేక శ్రవంతి అనే పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారి తీసింది.
ఆర్టీసీ కార్మికుల మీద..
ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ‘‘కష్టమొస్తే కాలికి ఉన్న ముళ్లు తీయాలి’’ అని ఒకప్పుడు చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం తమ పేరు ఎత్తితేనే కస్సుమంటున్నారని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. రూ. 50వేల వరకు జీతాలు ఉన్నాయని, ఆర్టీసీ నష్టాలకు కార్మికులే కారణమని, సమ్మె పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారని కేసీఆర్ అనడం వారిని ఆవేదనకు గురిచేసింది. 48వేల మంది ఆర్టీసీ కార్మికులపై వేటు వేయడం వివాదాస్పదమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, బకాయిలను విడుదల చేయాలని తాము ఎన్నోరోజులుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆర్టీసీ రక్షణ కోసం సమ్మెకు పిలుపునిస్తే ఇలా మాట్లాడటమేమిటని కార్మికులు అంటున్నారు. 50వేల జీతం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అంత జీతం ఉంటే లెక్క చూపించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆర్టీసీలోకి ప్రైవేటు బస్సులను దింపుతాననడం, 48వేల మంది స్థానంలో కొత్త వాళ్లను రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించడం కార్మికులను తీవ్రంగా కలవరానికి గురిచేస్తోంది. ఉద్యమమప్పుడు తమను ఆకాశానికి ఎత్తిన కేసీఆర్.. ఇప్పుడు ఇలా కక్షసాధిస్తున్నారెందుకని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి ఫారెస్టు అధికారులు కూడా బలి కావాల్సి వచ్చింది. అటవీ శాఖలో ప్రక్షాళన పేరుతో 200 మందిని బదిలీ చేసిన సర్కారు.. పోడు భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే సోదరుడి చేతిలో దెబ్బలుతిన్న మహిళా అధికారిని ట్రాన్స్‌ఫర్ చేసింది.
సర్పంచ్‌లపై కూడా
జాయింట్ చెక్ పవర్ పేరిట సర్పంచులు టార్గెట్ అయ్యారు. ఈ నిర్ణయం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని వాళ్లు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వం ససేమిరా అంది. చెక్ మీద సంతకం విషయంలో సర్పంచులు, ఉప సర్పంచులకు మధ్య ఊళ్లలో కొట్లాటలు జరుగుతున్నాయి. గ్రామంలోని అవినీతికి సర్పంచులే కారణమన్న తీరులో ప్రభుత్వం వ్యవహరిస్తోందని సర్పంచ్‌లు ఆగ్రహంతో ఉన్నారు. పని తీరు సరిగ్గా లేదనే కారణంతో అధికారులు కొందరు సర్పంచులకు నోటీసులు కూడా ఇచ్చారు. ప్రభుత్వంపై పోరాటం తప్ప మార్గం లేదని భావించిన వారు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేసి నిరసన తెలపాలని భావించారు. కానీ వారిని రాత్రికి రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి, ఆ సంఘ నేతపై కేసులు పెట్టారు.
యూనియన్లంటేనే మంట!
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు ఉండటం సహజం. తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మికులను, ఉద్యోగులను ఏకం చేసింది ఆ యూనియన్లే. రాష్ట్ర సాధనలో యూనియన్ల పాత్ర ఎనలేనిదని అప్పట్లో ఇప్పటి ప్రభుత్వ పెద్దలు కీర్తించారు. కానీ.. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక యూనియన్లంటేనే గరమవుతున్నారని యూనియన్నేతలు అంటున్నారు. ఇక ఆర్టీసీలో యూనియన్లు ఉండవని ఇటీవల తేల్చిచెప్పారు. ఇతర శాఖల్లోనూ యూనియన్లపైనా ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాల్లో పని చేసే నాయకులకు ఓడీ సౌకర్యం ఉంటుంది. ఏడాదిగా వారు దానికి దూరమయ్యారు. ప్రభుత్వం కక్షపూరితంగానే ఇలా వ్యవహరిస్తోందని అంటున్నారు. నిజానికి చాలా కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులుగా టీఆర్‌ఎస్ నేతలే ఉన్నారు. ఉద్యోగ సంఘాల లీడర్లుగా ఎదిగినవారు ప్రభుత్వ పదవులు అందుకున్నారు.

