V6 News

సర్కారు బడి తెరిచే రోజు కొత్త బట్టలు కష్టమే..

సర్కారు బడి తెరిచే రోజు కొత్త బట్టలు కష్టమే..
  •     ఈసారి పాత స్కూల్ ​డ్రెస్సులతో బడికి.. పంద్రాగస్టు కల్లా కొత్తవి అందుతాయన్నది డౌటే!
  •     అధికారుల నిర్లక్ష్యం.. టెస్కో ఆర్డర్ రద్దు.. పీఎంయూ టెండర్లలో జాప్యమే ప్రధాన కారణం 
  •     స్కూళ్లు ముగిసినా ఇంకా పూర్తికాని ప్రక్రియ  

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడులు తెరిచిన రోజే విద్యార్థులకు కొత్త యూనిఫాంలు అందించాలన్న లక్ష్యం ఈసారి నీరుగారేలా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజు జూన్ 12న డ్రెస్సులు ఇవ్వడం అసాధ్యమని తెలుస్తోంది. కనీసం పంద్రాగస్టు నాటికైనా కొత్త బట్టలు అందుతాయా.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల ప్రక్రియలో జాప్యం, క్లాత్ సేకరణలో నిబంధనల మార్పులే దీనికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, లోకల్ బాడీ, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్‌‌‌‌లతో పాటు వచ్చే ఏడాది నుంచి కొత్తగా చేరనున్న ప్రీప్రైమరీ చిన్నారులు కలిపి 20 లక్షల మంది విద్యార్థులకు సర్కారు యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉంది. 

దీని కోసం సుమారు కోటి మీటర్ల క్లాత్ అవసరం. గత నవంబర్‌‌‌‌లోనే విద్యాశాఖ టెస్కోకు  ఇండెంట్ పంపింది. ఏప్రిల్ నెలాఖరుకు క్లాత్‌‌‌‌ను స్కూల్ పాయింట్లకు చేర్చాలని ప్లాన్ చేశారు. కానీ, తాజాగా టెస్కో ఆర్డర్లను రద్దు చేసి, పీఎంయూ ద్వారా ఓపెన్ టెండర్లతో క్లాత్ సేకరించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. దీంతో సర్కారు స్కూళ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యార్థులకు సకాలంలో యూనిఫామ్ అందే పరిస్థితి కన్పించడం లేదు. 

కొలతలు తీసుకునేది ఎప్పుడు?

సాధారణంగా ఏప్రిల్ నెలాఖరులోగా విద్యార్థుల నుంచి కొలతలు తీసుకుని, వేసవి సెలవుల్లో కుట్టించి జూన్ 12న స్కూళ్లు తెరవగానే పంపిణీ చేసేవారు. కానీ, ఈనెల23తో అకడమిక్ ఇయర్ ముగిసింది. 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు క్లాత్ రాలేదు.. అటు కొలతలూ తీసుకోలేదు. ఇక సెలవుల తర్వాత జూన్ రెండో వారంలో స్కూళ్లు తెరిచాకే విద్యార్థుల కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది. స్కూల్​యూనిఫాంలు రెడీ కావాలంటే కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. 

అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటే విద్యార్థులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని టీచర్ సంఘాలు విమర్శిస్తున్నాయి. టెస్కో ద్వారా కాకుండా పీఎంయూ ద్వారా వెళ్లాలనుకున్నప్పుడు ఆ టెండర్ల ప్రక్రియను రెండు నెలల ముందే పూర్తి చేయాల్సి ఉండెనని పేర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో జూన్ నెలలో కొత్త డ్రెస్సులు వేసుకోవాలన్న పేద విద్యార్థుల ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి. జూన్, జూలై నెలల్లో పాత డ్రస్సులతోనే విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంద్రాగస్టు నాటికైనా పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందుతాయో లేదో వేచి చూడాలి.