
హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్-– 2025 నిర్వహించనున్నట్లు వీసీ ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఇందులో వివిధ వర్సిటీలకు చెందిన 626 మంది పాల్గొంటారని, ఇప్పటివరకు 750 వరకు పరిశోధనపత్రాలు అందినట్లు చెప్పారు.
వర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఇయర్ లోనే కేయూలో సైన్స్ కాంగ్రెస్ జరగడం గర్వకారణమని పేర్కొన్నారు. కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ సెమినార్ హాలులో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొ.సీహెచ్.మోహన్ రావుతో కలిసి సోమవారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేశ తొలి ఉపగ్రహం 'ఆర్యభట్ట' నింగిలోకి వెళ్లి 50 ఏండ్లు పూర్తి చేసుకోవడం, ఇదే సమయంలో వర్సిటీలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం విశిష్టతను సంతరించుకుందన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్ కు డీఆర్డీవో మాజీ డైరెక్టర్, కేంద్ర రక్షణమంత్రిత్వశాఖ శాస్త్రీయ సలహాదారు డా.జి.సతీశ్ రెడ్డి చీఫ్గెస్ట్ గా హాజరవుతారన్నారు. సదస్సులో 2 ప్లీనరీ సెషన్లు, 5 విస్తృత ఉపన్యాసాలు ఉంటాయన్నారు. జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 65 లెక్చర్స్, విద్యార్థులకు ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు ఉంటాయన్నారు.
స్కూల్ సైన్స్ టీచర్ల కు స్పెషల్ సెషన్లు, ఇస్రో, డీఆర్‌డీవో శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. సీసీఎంబీ మాజీ డైరెక్టర్, తెలంగాణ అకాడమీ సైన్సెస్ ప్రెసిడెంట్ ప్రొ.సీహెచ్.మోహన్ రావు మాట్లాడుతూ ఎంపరింగ్ ది యూత్, ప్రమోట్ ది సైన్స్ అనే కాన్సెప్ట్ తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నామన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కావాలన్నారు.
ఈ సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం, సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొ.బి.వెంకట్రామరెడ్డి, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కార్యదర్శి ప్రొ.ఎస్.సత్యనారాయణ, ట్రెజరర్ ప్రొ.ఎస్.ఎం. రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్లకు నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.