చంద్రయాన్ – 2 లో తెలంగాణ ముద్దుబిడ్డ: అభినందించిన హరీష్ రావు

చంద్రయాన్ – 2 లో తెలంగాణ ముద్దుబిడ్డ: అభినందించిన హరీష్ రావు

దేశానికి గర్వకారణమైన చంద్రయాన్-2లో భాగమైన రాష్ట్రానికి చెందిన శాస్త్రవెత్తకు అభినందనలు తెలిపారు టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి టీ హరీష్ రావు. యావత్ దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ 2 లో సిద్దిపేటకు చెందిన వ్యక్తి..  వీరబత్తిని సురేందర్ శాస్త్రవేత్తగా తన సేవలను అందించారు. ఇందుకు గాను హరీష్ రావు ట్విటర్ వేధికగా ఆయనను అభినందించారు.

“భారతదేశ శాస్త్ర సాంకేతిక అంతరిక్ష వైజ్ఞానిక రంగానికి తలమానికంగా నిలిచే చంద్రయాన్-2 లో పాలు పంచుకుంటున్న తెలంగాణ ముద్దుబిడ్డ, సిద్దిపేటకు చెందిన అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్త, ఆత్మీయ సోదరుడు వీరబత్తిని సురేందర్ కు మనసారా అభినందనలు. మన దేశానికి గర్వకారణంగా నిలిచే ఈ ప్రయోగంలో మీరు భాగస్వాములు కావడం మా అందరికీ గర్వకారణం. భారతదేశ అంతరిక్ష ప్రయోగరంగానికి, యావత్ వైజ్ఞానిక ప్రపంచానికి మీరు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి వ్యక్తిగతంగా నా తరపున, సిద్ధిపేట నియోజకవర్గ తరుపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు ” అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

ఇప్పటికే భారత్…  చంద్రయాన్ -1 ద్వారా ప్రపంచానికి నీటి జాడలు ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు ప్రయోగిస్తున్న చంద్రయాన్ -2 ద్వారా ప్రగ్యాన్ అనే రోవర్ ను 14 రోజులు చంద్రుని పై 500 మీటర్లు తిప్పనుంది. అది ఇస్రోకు చంద్రుని గురించి కీలకమైన సమాచారాన్ని ఇవ్వనుంది. రోవర్ ను గనుక విజయవంతంగా ప్రయోగించగలిగితే.. ప్రపంచంలో చంద్రునిపైకి రోవర్ పంపిన నాలుగవ దేశంగా భారత్ నిలుస్తుంది. ముందువరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉన్నాయి. శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 15 పొద్దున 2.54 నిమిషాలకు చంద్రయాన్ -2 ప్రయోగించనున్నారు.