- దావోస్‌లో వివిధ కంపెనీలతో 44 ఎంవోయూలు
- పెట్టుబడుల వివరాలు వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు
- ఆరోగ్యశ్రీ చెల్లింపులు పెరిగాయి: మంత్రి దామోదర
- ఖాళీల ఆధారంగా హోంశాఖలో ప్రమోషన్లు : మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: దావోస్ పర్యటనతో రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. 2024–25లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో మొత్తం 44 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడుల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉందని, ఈ ఫలితంగా కొత్తగా 68,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వచ్చిన పెట్టుబడులు, చేసుకున్న ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. పెట్టుబడులపై ప్రతిపక్షాలు చేస్తున్న విషప్రచారం ఆపాలని సూచించారు. గురువారం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యానారాయణ గుప్తా అడిగిన ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
‘దావోస్ పర్యటనల్లో భాగంగా రూ.81,800 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది. దీంతో ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం సమకూరింది. మరో 3 కంపెనీల (పెట్టు బడి రూ.30 వేల కోట్లు)కు కేటాయించేందుకు భూములను గుర్తించాం. మొత్తం 44 ఎంవోయూలతో రూ.2,19,182 కోట్లు పెట్టుబడులు వచ్చాయి’ అని మంత్రి వెల్లడించారు.
ఖాళీల ఆధారంగా పోలీస్ శాఖలో ప్రమోషన్లు : మంత్రి పొన్నం
హోంశాఖలో ఖాళీల ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఏర్పడిన ఖాళీలను అనుసరించి అర్హులైన పోలీస్ కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుల్స్‌గా ప్రమోషన్లు కల్పించామన్నారు. కానిస్టేబుల్స్ ప్రమోషన్లపై ఎమ్మెల్యే మందుల సామేల్ అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం సమాధానమిచ్చారు. ‘జోనల్ వైజ్ జరిగిన రిక్రూట్మెంట్లో ఖాళీల ఆధారంగా ప్రమోషన్లను భర్తీ చేస్తున్నాం.
పోలీస్ శాఖలో ఖాళీలను బట్టి ప్రమో షన్ల వస్తున్నాయి. వారికి రావాల్సిన ఇంటెన్సివ్ ఎప్పటికప్పుడు విడుదల చేశాం’ అని తెలిపారు. నిజామాబాద్ లో దాడి లో గాయపడిన కానిస్టేబుల్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చామని వెల్లడిం చారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఉద్యోగులకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీకి నెలకు రూ.89 కోట్లు చెల్లిస్తున్నం: మంత్రి దామోదర
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గతంలో ఏడాదికి సగటున రెండున్న లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందేవని, ఇప్పుడు ఏడాదికి 4 లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకుంటున్నారని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీ క్వశన్ అవర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు సగటున నెలకు రూ.52 కోట్లు చెల్లిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు సగటున రూ.89 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు.
2023 డిసెంబర్ 8 నుంచి ఇప్పటివరకూ రూ.2,400 కోట్లకు పైగా పేమెంట్స్ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.600 కోట్లకుపైగా బకాయిలు ఉండగా, ఈహెచ్‌ఎస్ కింద మరో రూ.130 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లకు సుమారు రూ.250 కోట్ల వరకూ మాత్రమే బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.
ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటికి రెగ్యులర్‌గా పేమెంట్స్ చేస్తున్నామని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు ప్రైవేట్ హాస్పిటళ్ల నిరాకరిస్తున్నాయని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యశ్రీలో చేరేందుకు ప్రైవేట్ హాస్పిటళ్లు ఆసక్తి చూపిస్తున్నాయని, తాము అధికారంలోకి వచ్చినప్పటికి 330 ప్రైవేట్ హాస్పిటళ్లలో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందగా, ఇప్పుడు ఆ సంఖ్య 537కు చేరిందని వివరించారు.
