తెలంగాణలో ఆటోలో కనీస ఛార్జీ రూ.30..ఆ తర్వాత కిలోమీటర్‌ కు రూ.14

తెలంగాణలో ఆటోలో కనీస ఛార్జీ రూ.30..ఆ తర్వాత కిలోమీటర్‌ కు రూ.14
  •     రాత్రి వేళల్లో 1.5 రెట్లు ఛార్జీ.. మీటర్ల మార్పునకు 3 నెలల గడువు
  •     ప్రజాభవన్‌లో జీవో విడుదల చేసిన భట్టి, పొన్నం

హైదరాబాద్, వెలుగు: ఆటోల్లో కనీస ఛార్జీని రూ.30గా, ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14గా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ప్రజాభవన్‌లో ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో యూనియన్ నేతలతో కలిసి జీవో కాపీని విడుదల చేశారు. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 46ను జారీ చేశారు. కొత్త సవరణ ప్రకారం ఆటో ఎక్కిన మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.30 చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్‌కు రూ.14 చొప్పున మీటర్ ఛార్జీ పడుతుంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు లేదా వెయిటింగ్ సమయానికి నిమిషానికి 75 పైసల చొప్పున డిటెన్షన్ ఛార్జీ వసూలు చేయొచ్చు. 

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు చెల్లించాలి. ప్రయాణికుడితో పాటు 100 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. బ్రీఫ్‌కేస్, హ్యాండ్‌బ్యాగ్, 60×40 సెం.మీ లోపు చిన్న బ్యాగులకు అదనపు ఛార్జీ ఉండదు. పెద్ద ప్యాకేజీలు, లగేజీ సంచులకు ఒక్కో ప్యాకేజీపై 50 పైసలు అదనంగా వసూలు చేయొచ్చు. కొత్త సవరణకు అనుగుణంగా డిజిటల్ మీటర్లను రీసెట్ చేసేందుకు ప్రభుత్వం మూడు నెలల గడువు ఇచ్చింది. మీటర్ ఆన్ చేయగానే రూ.30 నమోదయ్యేలా, 1.6 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్రతి 100 మీటర్లకు రూ.1.40 చొప్పున ఛార్జీ పెరిగేలా మీటర్లను సెట్ చేయాలి. అప్పటివరకు పాత, కొత్త ఛార్జీల వివరాలతో కూడిన టారిఫ్ కార్డును ప్రతి ఆటోలో ప్రయాణికులకు కనిపించేలా పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.