వరి సాగు @ 55 లక్షల ఎకరాలు... తెలంగాణలో రికార్డు స్థాయిలో వానాకాలం సాగు

వరి సాగు @  55 లక్షల ఎకరాలు... తెలంగాణలో రికార్డు స్థాయిలో వానాకాలం సాగు
  • నిరుడు ఇదే సమయానికి 31.60 లక్షల ఎకరాల్లోనే సాగు
  • మొత్తం 1.20 కోట్ల ఎకరాల్లో వానాకాలం పంటలు
  • 44.91 లక్షల ఎకరాల్లో పత్తి, 6.13 లక్షల ఎకరాల్లో మక్క
  • వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడి
  • ఈ సీజన్‌‌లో 90 శాతం పంటల సాగు నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌‌లో రికార్డు స్థాయిలో వరి సాగైంది. ఇప్పటివరకు 55 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌‌లో మొత్తం పంటల సాగు కోటి 20 లక్షల ఎకరాలకు చేరువైంది. సీజన్‌‌ సాధారణ సాగు కోటి 32 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే దాదాపు 90 శాతం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 

ఈయేడు వానాకాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక పునాస పంటల సాగు భారీగా తగ్గింది. జులై చివరి వారం, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలతో సాగు ఊపందుకుంది. ఈ నెల ప్రారంభం నుంచి వర్షాలు జోరందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, మరో 16 జిల్లాల్లో సరిపడా వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటి వరకు నాట్లు పడని ప్రాంతాల్లో కూడా వరి నాట్లు ఊపందుకున్నాయి. సీజన్ ముగిసే నాటికి రికార్డ్‌‌ స్థాయిలో వరి సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. 

తగ్గిన పత్తి, పెరిగిన మక్కల సాగు..

ఈ వానాకాలం సీజన్ వెనుకకు కావడంతో పత్తి పంట సాగుపై ప్రభావం చూపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఎకరాలు దాటుతుందనుకున్న పత్తి సాగు 44.91 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సీజన్ ఆలస్యమవడంతో వానలపై ఆధారపడే రైతులకు పత్తి సాగు కష్టంగా మారింది. నీటి వసతి ఉన్న రైతులే పత్తి సాగు చేశారు. పత్తి సాగు అదును దాటాక వర్షాలు కురవడంతో నీటి లభ్యత పెరిగి ఇప్పుడంతా రైతులు వరి సాగు వైపుకు మళ్లారు. 

ఫలితంగా ఈయేడు పత్తి సాగు తగ్గింది. అలాగే, మార్కెట్‌‌లో మక్క పంటకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈయేడు రైతులు మక్క సాగుకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా వానాకాలం మక్కల సాగు 6.13 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది. ఈ సీజన్‌‌లో మిగతా పంటల విషయానికి వస్తే కంది పంట 4.72 లక్షల ఎకరాలు, సోయా 3.59 లక్షల ఎకరాల్లో సాగైంది. మిగతా పంటలన్నీ నామమాత్రంగానే సాగయ్యాయి. జొన్నలు 34,274 ఎకరాల్లో వేయగా, పెసర్లు 59 వేల ఎకరాల్లో వేశారు. చెరుకు 29,310 ఎకరాలు, ఇలా మొత్తంగా సాగు మెరుగుపడినట్లు అగ్రికల్చర్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.


సాగులో నల్గొండ టాప్..

వానాకాలం సాగులో నల్గొండ టాప్‌‌లో నిలిచింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 9.66 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. సంగారెడ్డి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఖమ్మం జిల్లాలో 5.89 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 5.79 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 5.66 లక్షలు, కామారెడ్డిలో 5.52 లక్షలు, వికారాబాద్ జిల్లాలో 4.99 లక్షలు, సూర్యాపేట జల్లాలో 4.84 లక్షలు, సిద్దిపేటలో 4.74 లక్షల ఎకరాల్లో పంటలు సాగైయ్యాయి. 

మరోవైపు, వరి సాగులోనూ నిజామాబాద్ జిల్లా టాప్‌‌లో నిలిచింది. ఇక్కడ 4.36 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. తర్వాత నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3.96 లక్షల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 3.19 లక్షల ఎకరాలు, కామారెడ్డిలో 3.10 లక్షల ఎకరాలు, జగిత్యాలలో 2.97 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది.