తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ  ప్రపంచంతో  పోటీ పడాలి : సీఎం రేవంత్ రెడ్డి
  •   వందేండ్ల భవిష్యత్ కు ప్రణాళికలు
  •  పెట్టుబడులకు సర్కారు నుంచి రక్షణ
  •  అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టాం
  •  జహీరాబాద్ లో నిమ్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  •  ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో డ్రైపోర్టులు
  •  ఫార్మా విలేజ్ లు డెవలప్ చేసి సౌకర్యాలు కల్పిస్తం
  •  సీఐఐ విద్య, నైపుణ్యాభివృద్ది సమావేశంలో సీఎం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వందేండ్ల భవిష్యత్  ను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం  రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ  పడేలా తీర్చిదిద్దుతామని అన్నారు. తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే పెట్టామని అన్నారు. ఇందుకోసమే నిన్నకేంద్ర మంత్రులతో భేటీ అయినట్టు చెప్పారు. రాష్ట్రంలో  పెట్టబడులు పెట్టే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుందని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా కల్పిస్తుందని అన్నారు. కొత్త ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. 

ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన సీఐఐ విద్య, నైపుణ్యాభివృద్ది సమావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అపారమైన అనుభవం ఉన్న పారిశ్రామిక వేత్తలు తమ అనుభవాన్ని రంగరించి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2050 నాటికి మాస్టర్ ప్లాన్ ఫర్ తెలంగాణ తయారు చేస్తున్నామని, రాష్ట్రం మొత్తం సింగిల్ యూనిట్ గా ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తామని, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాలు అక్కడ అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. 

విద్య, వైద్యం, రోడ్లు, తాగునీరు ఇలా మౌలిక వసతులన్నీ కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.  డిఫరెంట్ ఇన్వెస్టర్లను క్లస్టర్లుగా విడగొట్టనున్నామని సీఎం చెప్పారు. జహీరాబాద్ లో నిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదని, త్వరలో ఏర్పాటు చేయబోతున్నమని సీఎం చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన వాళ్లు కూడా 15 వేలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని,  స్కిల్ విషయంలో ఎక్కడో గ్యాప్ ఉందని తాను భావిస్తున్నానని, దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలని కోరారు. తాము  ప్రారంభించబోయే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఇందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు సీఎం చెప్పారు.