మొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు 

మొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు 

మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)  సోదాలు కొనసాగుతున్నాయి.  సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు . ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతోపాటు హైదరాబాదులోనూ సోదాలు  జరుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని నందకుమార్ ఇల్లు, హోటల్లో సోదాలు చేశారు. హర్యానాలోని రామచంద్ర భారతి నివాసంతో పాటు కర్ణాటకలో ఆయనకు సంబంధించిన వారి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలో సింహయాజి స్వామీజీకి చెందిన ఆశ్రమంలో సోదాలు జరుగుతున్నాయి. కేరళలోని కొచ్చిలో ఉండే ఓ డాక్టర్ రామచంద్ర భారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. డాక్టర్ ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి బంధువు, తిరుపతి నుంచి హైదరాబాద్ కు రావడానికి సింహయాజీ స్వామీజీకి విమానం టికెట్ బుక్ చేసినట్లు గుర్తించారు. సిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారులు. దర్యాప్తులో భాగంగా త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నందకుమార్ అక్రమ నిర్మాణాల కూల్చివేత

ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. నందకుమార్ చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్.. డెక్కన్ హోటల్ కిచెన్ కోసం రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు గుర్తించి.. వాటిని కూల్చివేయించారు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతోనే తాము అక్రమ నిర్మాణాలను కూల్చివేయించామని అధికారులు తెలియజేశారు. 

నవంబరు 9న సిట్ ఏర్పాటు..

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం  ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను నవంబరు 9న  ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో పనిచేస్తోంది. ఇందులో సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్  శింగేనావర్, శంషాబాద్ డీసీపీ ఆర్.జగదీశ్వర్ రెడ్డి, నారాయణ్ పేట్ ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, రాజేంద్ర నగర్ డివిజన్ ఏసీపీ బి.గంగాధర్, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో లక్ష్మీ రెడ్డి ఉన్నారు.