టెన్త్​లో 92.78% పాస్ .. పెరిగిన పాస్ పర్సంటేజీ

టెన్త్​లో 92.78% పాస్ .. పెరిగిన పాస్ పర్సంటేజీ
  • మహబూబాబాద్ జిల్లా ఫస్ట్.. వికారాబాద్ జిల్లా లాస్ట్
  • రిజల్ట్స్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి 
  • మరోసారి సత్తా చాటిన ప్రభుత్వ గురుకులాలు
  • 2 ప్రైవేటు స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలె..
  • 4,629 బడుల్లో వందశాతం ఉత్తీర్ణత 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 92.78% మంది స్టూడెంట్లు పాస్ అయ్యారు. ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటారు. రిజల్ట్స్​లో మహబూబాబాద్ జిల్లా టాప్ లో నిలవగా, వికారాబాద్ జిల్లా లాస్ట్ లో నిలిచింది. సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు మార్కులూ ఇచ్చారు. 

రవీంద్రభారతిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ సురేష్ షెట్కర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను బుధవారం రిలీజ్ చేశారు. గతేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజీ 1.47% పెరిగింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 3 వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 7 నుంచి 15 వరకు వాల్యూయేషన్ పూర్తి చేశారు. 

బాలురు 91.32%, బాలికలు 92.78% పాస్

రాష్ట్రవ్యాప్తంగా 5,09,564 మంది ఎగ్జామ్ ఫీజు చెల్లించగా, 5,07,107 మంది హాజరయ్యారు. దీంట్లో 4,96,374 మంది రెగ్యులర్ స్టూడెంట్లు పరీక్షలు రాయగా, 4,60,519 (92.78%) మంది ఉత్తీర్ణత సాధించారు.  వీరిలో 2,50,345 మంది బాలురు ఎగ్జామ్స్ రాస్తే 2,28,608 (91.32%) మంది, బాలికలు 2,46,029 మందికి గానూ 2,31,911 (94.26%) మంది పాస్ అయ్యారు. 


పరీక్షలకు 10,733 మంది ప్రైవేటు విద్యార్థులు అటెండ్ అయితే, వారిలో 6141 మంది (57.22%) మంది పాస్ అయ్యారు.  అయితే, గతేడాది 91.31శాతం మంది పాస్ కాగా.. ఈసారి 92.78శాతానికి పాస్ పర్సంటేజీ పెరిగింది. సీడబ్ల్యూఎస్ఎన్ కేటగిరిలోని విద్యార్థులు ఈసారి 1306 మంది అటెండ్ కాగా, 1222 (93.57%) మంది పాసయ్యారు. 

నిరుడు 3,927 బడుల్లో 100% పాస్ పర్సంటేజీ

పరీక్షలు రాసిన స్టూడెంట్లంతా పాసైన బడుల సంఖ్య పెరిగింది. గతేడాది 3,927 బడుల్లో వందశాతం ఉత్తీర్ణత ఉంటే.. ఈసారి 11,554 హైస్కూళ్లలో 4,629 బడుల్లో అందరూ పాసయ్యారు. దీంట్లో 2,007 ప్రైవేటు స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్లు 28, ఆశ్రమ స్కూళ్లు 126, బీసీ వెల్ఫేర్ 143, గవర్నమెంట్ స్కూళ్లు 73, కేజీబీవీలు 230, మోడల్ స్కూళ్లు 79, తెలంగాణ రెసిడెన్షియల్స్ 24, మైనార్టీ రెసిడెన్సియల్స్ 91, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 108, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు 45, జిల్లా పరిషత్ హైస్కూళ్లు 1,675 ఉన్నాయి. అయితే, 2 ప్రైవేటు బడుల్లో ఒక్కరూ పాస్ కాలేదు. రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా 99.29%, రంగారెడ్డి జిల్లా 99.09 శాతం పాస్​తో టాప్​లో ఉండగా, వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివర్లో నిలిచింది.

సత్తాచాటిన గురుకులాలు

టెన్త్ ఫలితాల్లో సర్కారీ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో నడిచే తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి 2,479 మంది పరీక్ష రాస్తే.. 2,449 (98.79%) మంది పాసయ్యారు. బీసీ వెల్ఫేర్ గురుకులాల నుంచి 17,431 మంది రాయగా 17,046 (97.79%) మంది, సోషల్ వెల్ఫేర్ గురుకులాల నుంచి 17,440 మంది ఎగ్జామ్ రాస్తే 17,040 (97.71%), ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 6,589 మంది రాస్తే 6,433 (97.63%) మంది, మైనార్టీ రెసిడెన్షియల్ నుంచి 9,349 మందికి గానూ 9,028 (96.57%) మంది ఉత్తీర్ణత సాధించారు. 

వీరితో పాటు మోడల్ స్కూల్స్ నుంచి 16,455 మంది ఎగ్జామ్స్ రాస్తే వారిలో 15,683 (95.31%) మంది, ఆశ్రమ స్కూళ్ల నుంచి 8,123 మందికి గానూ 7,717 (95%) మంది, కేజీబీవీల నుంచి 17,818 మందికి 16,824 (94.42%), ప్రైవేటు స్కూళ్ల నుంచి 2,36,311 మందికి గానూ 2,22,633 (94.21%) మంది, ఎయిడెడ్ స్కూళ్ల నుంచి 6,451 మందికి గానూ 5,848 (90.65%) మంది, జిల్లా పరిషత్ స్కూళ్ల నుంచి 1,35,849 మందికి గానూ 1,21,089 (89.13%), గవర్నమెంట్ స్కూళ్లలో 22,079 మందికి గానూ 18729 (84.83%) మంది పాసయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ హరిత, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

15 వరకూ రీ కౌంటింగ్ అవకాశం

మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన విద్యార్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఛాన్స్ ఉంది. ఆయా విద్యార్థులు మే 15లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో సబ్జెక్టుకు రీ కౌంటింగ్​కు రూ.500, రీ వెరిఫికేషన్​ కోసం రూ.వెయ్యి ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. అప్లికేషన్ ఫామ్ www.bse.telangana.gov.in  వెబ్ సైట్​లో ఉందని పేర్కొన్నారు.

ప్లానింగ్ ప్రకారం చదివా: నిమ్మ అన్చిత , 596 మార్కులు

మాది కామారెడ్డి జిల్లా. ప్రస్తుతం ఎస్​ఆర్ స్కూల్​లో టెన్త్ పూర్తయింది. అమ్మ నాన్నలు చదువులో ప్రోత్సహించారు. టెన్త్ పరీక్షల్లో 596 మార్కులు రావడం సంతోషంగా ఉంది. ప్రణాళిక ప్రకారం చదివాను. సబ్జెక్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఎగ్జామ్స్ రాశా. ప్రతి అంశానికి హెడ్డింగ్ పెట్టా. భవిష్యత్​లో మంచి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలన్నదే నా లక్ష్యం. 

టీచర్ల గైడెన్స్ ప్రకారం చదివిన: సిర్ప క్రితి, 596 మార్కులు

మాది నిజామాబాద్ సిటీ. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ లో టెన్త్ చదివా. టీచర్ల గైడెన్స్, ప్రణాళిక ప్రకారం చదివాను. టాప్ మార్కులు వస్తాయని ముందే ఊహించాను. భవిష్యత్​లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్ కావాలన్నదే నా కోరిక. ఈ ఘనతలో అమ్మానాన్న ప్రోత్సాహం ఉంది.

జూన్ 3 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ 

టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఈ నెల 16 వరకు ఆయా స్కూళ్ల హెడ్మాస్టర్లకు ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని సూచించారు. అయితే, లేట్ ఫీజు రూ.50తో సబ్జెక్టు ఎగ్జామ్ కు 2 రోజుల ముందు వరకూ ఫీజు కట్టే అవకాశం ఉందని వెల్లడించారు. స్కూళ్లు, ఎగ్జామ్ సెంటర్ల నుంచి కొంత సమాచారం రాకపోవడంతో కొందరు విద్యార్థుల ఫలితాలను విత్ హెల్డ్ లో పెట్టినట్టు చెప్పారు.