- నిరుడుకంటే మహబూబ్నగర్ జిల్లాలో పెరిగిన పాస్ పర్జంటేజ్
- సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
నెట్వర్క్, వెలుగు : ఇంటర్మిడియట్ ఫలితాల్లో మాదిరిగానే టెన్త్లోనూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విద్యార్థినులు సత్తా చాటారు. బుధవారం మధ్యాహ్నం వెలువడిన ఫలితాల్లో బాలురకంటే బాలికలే ఎక్కువ మంది పాస్ అయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో నాగర్కర్నూల్ లో ఎక్కువ శాతం మంది పాస్ అయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 10,641 మంది పరీక్షలకు హాజరు కాగా 99.03 ఉత్తీర్ణత శాతంతో రాష్ర్టంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొత్తం విద్యార్థుల్లో 10,538 మంది పాస్ కాగా.. ఇందులో బాలురు 5,528 మందికి 5,192 మంది, బాలికలు 5,383 మందికి 5,346 మంది ఉత్తీర్ణత సాధించారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 8,306 మంది పరీక్షలకు హాజరు కాగా 97.22 శాతం మంది పాస్ అయ్యారు.
ఇందులో బాలురు 3971 మందికి 3860 మంది, బాలికలు 4335 మందికి 4265 మంది పాస్ అయ్యారు. వనపర్తి జిల్లాలో 7210 మందికి 97.46 శాతం ఉత్తీర్ణతతో 7027 మంది పాస్ అయ్యారు. ఇందులో బాలురు 3591 మందికి 3462 మంది, బాలికలు 3619 మందికి 3565 మంది ఉత్తీర్ణత సాధించారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 13,199 మందికి 94.57 ఉత్తీర్ణత శాతంతో 12,482 మంది పాస్ అయ్యారు. వీరిలో బాలురు 6602 మందికి గాను 6157 మంది, బాలికలు 6597 మందికి 6325 మంది పాస్ అయ్యారు. జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 8037 మంది పరీక్షలకు హాజరు కాగా 93.93 శాతం ఉత్తీర్ణతతో 7549 మంది పాస్ అయ్యారు. వీరిలో బాలురు 3847 మందికి 3548 మంది, 4190 మంది బాలికలకు 4001 మంది పాస్ అయ్యారు.
ఉమ్మడి నల్గొండ..
నల్గొండ జిల్లాలో 98.47 శాతం, సూర్యాపేట జిల్లాలో 98.60శాతం, యాదాద్రిలో 98.30 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో 6376 మంది బాయ్స్ పరీక్ష రాయగా 6272 మంది విద్యార్థులు పాసై 98.37శాతం ఉత్తీర్ణత సాధించగా 5975 మంది గర్ల్స్ పరీక్ష రాయగా 5906 మంది పాసై 98.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. నల్గొండ జిల్లాలో 9536 మంది గర్ల్స్ పరీక్ష రాయగా 9417 మంది గర్ల్స్ పాసై 98.75 శాతం ఉత్తీర్ణత సాదించారు. 10131 మంది బాయ్స్ పరీక్ష రాయగా 9949 మంది పాస్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు సైతం 100శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాయి. ఇమాంపేట జిల్లా పరిషత్‌హై స్కూల్‌కు చెందిన నరిగే తేజశ్రీ అత్యధికంగా 583 మార్కులు సాధించింది. నల్గొండ జిల్లాలో మొత్తం 19,667 మంది విద్యార్దులు పరీక్ష రాయగా 19,366 మంది పాస్ అయ్యారు. మొత్తం 98.47 శాతం ఉత్తీర్ణత సాదించి రాష్ట్రంలో 10 వ స్థానంలో నల్గొండ జిల్లా నిలిచింది.
సూర్యాపేట జిల్లాలో 98.60శాతం
జిల్లాలో మొత్తం 12351 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 12178 మంది విద్యార్థులు పాసై 98.60శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచారు. జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల, మోడల్‌స్కూళ్లు 100శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటారు. 112 ప్రభుత్వ జెడ్పీ, ఉన్నత పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయి. 14 కేజీబీవీలు, మూడు మోడల్‌స్కూల్స్, 17 రెసిడెన్షియల్స్ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటారు.
యాదాద్రి.. యాదాద్రి జిల్లా గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి ఏకంగా 98.30 శాతం సాధించి 12వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 8918 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయగా 8766 (98.30 శాతం) మంది స్టూడెంట్స్ పాసయ్యారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా బాలుర కంటే బాలికలే మంచి ఫలితాలు సాధించారు. 4325 మంది బాలురు ఎగ్జామ్ రాయగా వీరిలో 4235 (97.92 శాతం) మంది పాసయ్యారు. 4593 మంది బాలికలు ఎగ్జామ్ రాయగా వీరిలో 4531 (98.65 శాతం) మంది పాసయ్యారు.
చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం హైస్కూల్ స్టూడెంట్ పిన్నింటి మైథిలి 573 మార్కులు సాధించగా గుండాల మండలం ఎల్లంల హైస్కూల్ స్టూడెంట్ సంగి యశశ్రీ 572 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. గుండాల కేజీబీవీ స్కూల్ స్టూడెంట్ బత్తుల అక్షయ 554 మార్కులు, చౌటుప్పల్ మండలం లక్కారం మోడల్ స్కూల్ స్టూడెంట్ చర్మదాసు గాయత్రి 571 మార్కులు సాధించి ఫస్ట్ ప్లేస్లో నిలిచారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికలు పైచేయి సాధించారు. సంగారెడ్డి జిల్లా 98.69 శాతంతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలవగా.. సిద్దిపేట జిల్లా 97.75 శాతంతో 13వ స్థానం, మెదక్ 96.63శాతం సాధించింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 24,573 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా, 24,252 మంది(98.69శాతం) పాసయ్యారు. ఇందులో బాలురు 12,548 మంది, బాలికలు 11,704 మంది ఉన్నారు. మెదక్ జిల్లాలో 11,232 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 10,853 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (96.63 శాతం) సాధించారు. బాయ్స్ 5,572 మంది పరీక్షలు రాయగా 5,331 మంది (95.67 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గర్ల్స్ 5,660 మంది పరీక్షలు రాయగా.. 5,522 మంది (97.56 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
అల్లాదుర్గం, నిజాంపేట, వెల్దుర్తి మండలాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 126 స్కూల్స్ వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అందులో జడ్పీ స్కూల్స్ 77, ప్రైవేట్ స్కూల్స్ 25, కేజీబీవీలు 9, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ 4, మోడల్ స్కూల్స్ 4, టీడబ్ల్యూఆర్3, ఎస్‌డబ్ల్యూఆర్ 2, ఆర్ఈఎస్ మినీ ఒకటి, ఆర్ఈఎస్ ఒకటి ఉన్నాయి. సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది. మొత్తం15,325 మంది పరీక్షలు రాయగా 14,995 మంది విద్యార్థులు (97.85 శాతం) పాస్ అయ్యారు. ఇందులో బాయ్స్ 7,752 మందికి గానూ 7,540 మంది (97.27 శాతం), గర్ల్స్ 7,573 మంది పరీక్షలు రాయగా.. 7,455 మంది (97.85 శాతం) పాస్ అయ్యారు. సిద్దిపేట పట్టణంలోని స్ర్పింగ్ డైల్స్ హైస్కూల్ స్టూడెంట్ సాత్విక 595 మార్కులు సాధించింది. జిల్లాలోని 136 ప్రభుత్వ స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

