
- తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ ఏర్పడి పదేండ్లు దాటినా.. వైన్ షాపుల టెండర్లలో ఆంధ్ర వ్యాపారుల పెత్తనం కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని అన్నారు. మంగళవారం నాంపల్లి ఆబ్కారీ భవన్ లో ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను కలిసి సమస్యను వివరించారు.
ఆంధ్ర సిండికేట్ వ్యాపారులు తెలంగాణలో చొరబడి అక్రమంగా వ్యాపారాలు చేస్తూ ఇక్కడి వ్యాపారుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. వారి కోసమే టెండర్ల గడుపు తేదీని పెంచినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాపారులు ఆంధ్రలో టెండర్లు వేస్తే అక్కడి వ్యాపారులు అడ్డుకొని దాడులకు పాల్పడ్డారని.. అలాంటి వ్యక్తులకు మన రాష్ట్రంలో టెండర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని ఆంధ్ర వ్యాపారులకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని కోరారు.