తెలంగాణలోని పార్లమెంట్ల నియోజకవర్గ బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అప్పగించారు. నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ల పార్లమెంట్లతో పాటు మహిళా కాంగ్రెస్, సేవాదళ్, కిసాన్ కాంగ్రెస్, రాజీవ్ గాంధీ ప్రచార్ విభాగాలను సెక్రెటరీ బోసురాజుకు అప్పగించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్స్ తోపాటు యూత్ కాంగ్రెస్, మైనార్టీ, ఓబిసి, ఎస్సీ, ఎస్టీ విభాగాలను సెక్రెటరీ నదీమ్ జావీద్ చూడనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబ్ బాద్ పార్లమెంట్లతో పాటు nsui, లీగల్, జవహర్ బాల్ మంచ్, సోషల్ మీడియా విభాగాలను సెక్రటరీ రోహిత్ చౌదరికు అప్పగించారు. అంతకంటే ముందు...గాంధీభవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతనలో అనుబంధ సంఘాల ఛైర్మన్ ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని యోచిస్తున్నారు. త్వరలోనే జరిగే మునుగోడు ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఈ నెల 13 న మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదర్ గౌడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చెరుకు సుధాకర్ తో సమావేశం జరిగింది. మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెరుకు సుధాకర్ వెల్లడించారు.
