
- వ్యవసాయ భూముల లెక్క తేల్చనున్న ప్రభుత్వం
- పైలట్ స్టడీ కోసం కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఎంపిక
- ఒక్కో జిల్లాలోని రెండు మండలాల్లో సర్వే షురూ
- పంచాయతీ సెక్రటరీలు, ఐకేపీ సీసీలు, ఏఈఓలకు బాధ్యతలు
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో వాడుకలో లేని వ్యవసాయ భూముల లెక్క తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాంపిల్ సర్వేను ప్రారంభించింది. ఫీల్డ్ లో పంట సాగవుతున్నప్పటికీ క్రాప్ బుకింగ్ యాప్ లో గతంలో తప్పుగా నమోదై ఉంటే.. రైతు నష్టపోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఇలాంటి భూములను మరోసారి వెరిఫై చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా ఐదు జిల్లాలను (కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం, కామారెడ్డి, సంగారెడ్డి) పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులోనూ జిల్లాకో రెండు మండలాల చొప్పున మొత్తం 180 గ్రామాల్లో ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2018 నుంచి ఏటా సీజన్ లో ఏఈఓలు, ఏఓలు క్రాప్ బుకింగ్ డేటాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సాగుచేస్తున్న భూముల వివరాలతోపాటు సాగులో లేని భూముల వివరాలు కూడా నమోదు చేశారు. అయితే ఈ డేటాలో ఉన్న సాగులో లేని భూముల వివరాలను ఇప్పుడు రీవెరిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో పనిచేసే పంచాయతీ సెక్రటరీలు, ఐకేపీ సీసీలు, ఏఈఓలకు బాధ్యతలు అప్పగించింది.
ఫీల్డ్ వెరిఫికేషన్ ఇలా..
ల్యాండ్ యుటిలైజేషన్ సర్వే ఫీల్డ్ వెరిఫికేషన్ లో భాగంగా గతంలో పంట సాగుచేయడం లేదని నమోదైన భూముల వివరాలను మాత్రమే రీవెరిఫై చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో సర్వే నంబర్ల వారీగా ఈ వివరాలు ఉన్నాయి. ఈ సర్వే నంబర్లను సెలెక్ట్ చేసి పంట సాగులో లేకపోవడానికి గల కారణాలను యాప్ లో పొందుపరుస్తున్నారు. ఈ కారణాల్లో ఇండ్లు, కమర్షియల్/లేఔట్, లీగల్ రిజిస్ట్రేషన్లు, గుట్టలు, చెరువులు, ప్రభుత్వం సేకరించిన భూమి అనే అంశాలతోపాటు మరేదైనా కారణముంటే ఎంట్రీ చేసేందుకు ఆప్షన్ ఇచ్చారు. సాగులో ఉన్నప్పటికీ సాగులో లేదని గతంలో తప్పుగా నమోదై ఉంటే ఆ విషయాన్ని కూడా అప్ డేట్ చేస్తున్నారు. ఇందులోనూ తప్పుగా నమోదైంది, క్రాప్ రొటేషన్ ప్లాన్, ఒక సీజన్ లో వదిలేయడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల, నీళ్ల వసతి లేకపోవడం వల్ల, భూసారం లేకపోవడం వల్ల సాగు చేయడం లేదు అనే ఆప్షన్లు ఇచ్చారు. ఇవిగాక ఇతర కారణాలు ఏమైనా ఉంటే ఎంట్రీ చేసేందుకు ఆప్షన్ ఇచ్చారు. వెరిఫై చేసిన భూమి ఫొటోను అక్కడే జియో ట్యాగ్ చేస్తున్నారు.
సాగులో లేని భూమి 20 లక్షల ఎకరాలకు పైనే
పంటల సాగు విస్తీర్ణాన్ని తెలుసుకునేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రతి సీజన్ లో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్లు క్రాప్ బుకింగ్ నమోదు చేస్తున్నారు. నిరుడు వానాకాలం సీజన్ కు రాష్ట్రంలో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు విడుదలైనప్పటికీ.. క్రాప్ బుకింగ్ లెక్కల ప్రకారం అన్ని రకాల పంటలు కలిపి 1.26 కోట్ల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఈ లెక్కన 26 లక్షల ఎకరాల్లో ఎలాంటి పంట సాగు చేయకున్నా యజమానులకు పెట్టుబడి సాయం అందింది. రైతుభరోసాను గుట్టలు, రోడ్లు, చెరువులు, కుంటలు, ఇళ్లు, ప్లాట్లు వంటి వ్యవసాయేతర భూములకు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిజమైన రైతులు నష్టపోకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ను రీవెరిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టడీలో భారీ తేడాలు ఉంటే రాష్ట్రమంతా సర్వే నిర్వహించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖకు చెందిన ఓ అధికారి వెల్లడించారు.