గురుకులాల్లో ఫుడ్‌పై మండల స్థాయిలో మానిటరింగ్ కమిటీలు

గురుకులాల్లో ఫుడ్‌పై మండల స్థాయిలో మానిటరింగ్ కమిటీలు
  • మండలస్థాయిలో ఏర్పాటు..
  • కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్ ప్రతినెలా సీఎస్‌కు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు  
  • కుక్‌లకు సైతం వంటలపై ఎన్ఐఎన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ 
  • విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్​ అందించడంపై సర్కారు స్పెషల్​ ఫోకస్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో తరచుగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ గురుకులాల ఆహార విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు పలు కీలక ఆదేశాలను జారీ చేయడమే కాకుండా.. పర్యవేక్షణ, శిక్షణకు అధిక ప్రయారిటీ ఇవ్వాలని సూచించింది.  క్షేత్రస్థాయిలో రెగ్యులర్‌‌గా తనిఖీలు చేస్తూ.. గురుకులాల్లో వసతి, ఆహార నాణ్యతను పర్యవేక్షించేందుకు మండలస్థాయి మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలు ప్రతిరోజూ గురుకులాలను విజిట్ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రతను నిశితంగా పరిశీలించాలని సూచించింది.

 ఆహారం తయారీ నుంచి పంపిణీ వరకు ప్రతి దశలోనూ పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లోపాలున్నా తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ కమిటీల నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. గురుకులాల్లోని ఆహార విధానంపై కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ప్రతినెలా సీఎస్‌కు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదికలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలు, కమిటీల పర్యవేక్షణ వివరాలు, ఆహార నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలు స్పష్టంగా ఉండాలని తెలిపింది. ఉన్నతస్థాయి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణతో గురుకులాల్లో ఆహార భద్రత మరింత పటిష్టం అవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. 

కుక్‌‌లకు సమగ్ర శిక్షణ

గురుకులాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతను మెరుగుపరచడంలో భాగంగా కుక్‌‌లకు (వంట సిబ్బందికి) ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శిక్షణను ప్రముఖ జాతీయ సంస్థ అయిన నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్​) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వంట సిబ్బందికి పోషకాహార విలువలు, ఆహార శుభ్రత ప్రమాణాలు, సురక్షితమైన వంట పద్ధతులు, ఆహారం నిల్వ చేసే విధానాలపై సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణతో వంట సిబ్బందిలో అవగాహన పెరిగి, ఆహార సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయని ప్రభుత్వం భావిస్తున్నది. 

 కూరల్లో కారం, ఉప్పు, నూనె  ఎంత వేసుకోవాలి ? కూరగాయలు  ఎలా ఉన్నాయో తెలుసుకునే విధానంపై కూడా అవగాహన కల్పించి, ట్రైనింగ్​ఇవ్వనున్నారు.  పర్యవేక్షణ, శిక్షణతోపాటు ఆహార పదార్థాల కొనుగోలు, నిల్వ, వంట ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా మార్గదర్శకాలను రూపొందించారు. మెరుగైన నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించడం ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ కఠిన చర్యలతో గురుకులాల్లోని విద్యార్థులకు పోషక విలువలతో కూడిన  పరిశుభ్రమైన ఆహారం అందుతుందని, భవిష్యత్తులో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు తగ్గుతాయని   ప్రభుత్వం భావిస్తున్నది.