రాష్ట్రంలో వడదెబ్బకు ఇప్పటికే 20 మంది దాకా మృతి

రాష్ట్రంలో వడదెబ్బకు ఇప్పటికే 20 మంది దాకా మృతి
  • రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా సర్కారు చర్యల్లేవ్​
  • జనానికి ఎప్పటికప్పుడు అలర్ట్​లను ఇస్తలే.. అవగాహన కల్పిస్తలే
  • జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రత్యేక ఆఫీసర్లను నియమించలే
  • 2021లో యాక్షన్​ ప్లాన్​ అమలు.. ఇప్పుడు దాని ఊసే లేదు
  • మరో 2 రోజులు వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయన్న వాతావరణ శాఖ
  • 16 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్​, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారానికి వడగాడ్పులకు సంబంధించి ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. మరోవైపు ఆయా జిల్లాల్లో ఆదివారం కూడా తీవ్రమైన వడగాడ్పులు వీచినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 44.3 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. 70 మండలాల్లో 42 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డ్​ అయ్యాయి.

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఎండలకు జనం చనిపోతున్నా రాష్ట్ర సర్కారు ఎలాంటి యాక్షన్​ ప్లాన్​ అమలు చేయడం లేదు. ఈసారి ఎండాకాలంలో ఇప్పటివరకు దాదాపు 20 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. వరంగల్​, మహబూబాబాద్​, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, జగిత్యాల, నల్గొండ, హైదరాబాద్​లో ఆ మరణాలు నమోదయ్యాయి. ఇవన్నీ మీడియాలో రిపోర్ట్​ అయినవే. రిపోర్ట్​ కాని కేసులు ఇంకా ఎక్కువే ఉంటాయని అధికారులు అంటున్నారు. జూన్​ నెల సగం గడిచిపోయినా రుతుపవనాల జాడ లేక.. ఎండలు మండిపోతున్నాయి. ఇంకొన్నాళ్లపాటు వడగాడ్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా..  వాతావరణ శాఖ చెప్తున్నా..  రాష్ట్ర సర్కారు మాత్రం  క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. హీట్​వేవ్స్​ మీద జనానికి అలర్ట్​లుగానీ.. అవగాహన గానీ కల్పించడం లేదు. 

చేయాల్సిన యాక్షన్​ ప్లాన్​ ఇదీ.. కానీ!

రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో హీట్​ వేవ్​ యాక్షన్​ ప్లాన్​ను అమలు చేయాల్సి ఉంటుంది. స్టేట్​ లెవల్​లో నోడల్​ ఆఫీసర్​ను, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఆఫీసర్లను రాష్ట్ర డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అథారిటీ నియమించాలి. 

..జనం చస్తున్నా నో యాక్షన్

ఎండలు, హీట్​వేవ్స్​ తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్స్​ ఇవ్వాలి. అన్ని శాఖలతో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. నిర్దేశిత ప్రదేశాల్లో కలర్​ కోడింగ్​లతో హీట్​ వేవ్స్​ తీవ్రతను రెవెన్యూ డిపార్ట్​మెంట్ వివరిస్తూ బోర్డులను ఏర్పాటు చేయాలి. వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు క్షేత్ర స్థాయిలో ఆరోగ్య శాఖ అధికారులను అలర్ట్​గా ఉంచాలి. హీట్​వేవ్స్​ తీవ్రతకు తగ్గట్టు ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచుకోవాలి. హీట్​వేవ్స్​ ప్రభావాన్ని బట్టి యాక్షన్​ ప్లాన్​ను మార్చుకోవాలి. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ఆ జాడే లేదు.

కమిటీ ఉందా.. లేదా!

హీట్​ వేవ్​ యాక్షన్​ ప్లాన్​ గైడ్​లైన్స్​ కోసం రెవెన్యూ డిపార్ట్​మెంట్​ సెక్రటరీ మెంబర్​ కన్వీనర్​గా ఓ కమిటీని ఏ ఏడాదికి ఆ ఏడాది నియమించాల్సి ఉంటుంది. అందులో స్కూల్​ ఎడ్యుకేషన్​, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, యానిమల్​ హజ్బెండరీ, ఫిషరీస్​ శాఖ, ఐటీ ఎలక్ట్రానిక్స్​ కమ్యూనికేషన్​ శాఖ, హెల్త్​మెడికల్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ శాఖల ప్రిన్సిపల్​ సెక్రటరీలు, డీహెచ్​, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ప్రివెంటివ్​ మెడిసిన్​, ఐఎండీల డైరెక్టర్లు, ఐ అండ్​పీఆర్​ కమిషనర్​, ఫైర్​ సర్వీసెస్​ డిపార్ట్​మెంట్​ డీజీలను సభ్యులుగా నియమించాలి. ఆ కమిటీ ఎప్పటికప్పుడు హీట్​వేవ్స్​ యాక్షన్​ ప్లాన్​పై గైడ్​లైన్స్​ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కమిటీ ప్రస్తుతం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 
ఈ ఏడాది హీట్​వేవ్స్​పై రివ్యూ జరగలేదు.

2015లో 541 మంది మృతి

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వడదెబ్బ వల్ల జనాలు పిట్టల్లా రాలిపోయారు. 2015లో 541 మంది వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు.2016లో  324 మంది ఎండదెబ్బకు చనిపోయారు. 2017లో 108 మంది, 2018లో 12 మంది, 2019లో 64 మంది వడగాడ్పులకు ప్రాణాలు వదిలారు. 2020లో 9 మంది చనిపోయారు. 2021, 2022లోనూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది 20 మంది దాకా మృత్యువాతపడ్డారు. హీట్​వేవ్స్, డైలీ టెంపరేచర్స్​కు సంబంధించి తెలంగాణ స్టేట్​ డెవలప్​మెంట్​ అండ్​ ప్లానింగ్​ సొసైటీ ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం జనానికి చేరడం లేదు.

స్కూల్​ పిల్లల పరిస్థితి ఏంది? 

టెంపరేచర్లు ఎక్కువగా ఉండి వడగాడ్పులు తీవ్రంగా ఉంటే.. స్కూళ్ల టైమింగ్స్ లో  మార్పులు చేయాల్సి ఉంటుంది. వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండేది పిల్లలపైనే కాబట్టి.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్​ను ఖరారు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో స్కూళ్లు రీ ఓపెన్​ అయ్యే టైమ్​కు ఎండలు తీవ్రంగానే ఉన్నా.. డేట్లను ప్రభుత్వం రీషెడ్యూల్​ చేయలేదు. కనీసం  స్కూల్​ టైమింగ్స్​నైనా సవరించలేదు.