సెప్టెంబర్ 17న ఏం చేద్దాం?..బీజేపీ, కాంగ్రెస్ యాక్టివిటీస్​తో సర్కార్​లో డైలమా

సెప్టెంబర్ 17న ఏం చేద్దాం?..బీజేపీ, కాంగ్రెస్ యాక్టివిటీస్​తో సర్కార్​లో డైలమా

హైదరాబాద్​, వెలుగు: నిజాం పాలన నుంచి విముక్తి లభించిన ‘సెప్టెంబర్​ 17’ను పురస్కరించుకుని నిర్వహించే ప్రోగ్రామ్​పై రాష్ట్ర సర్కార్​ తర్జనభర్జన పడుతున్నది. నిరుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. అప్పుడు దీనికి పోటీగా రాష్ట్రంలోని బీఆర్​ఎస్​ ప్రభుత్వం జాతీయ సమైక్యత ఉత్సవాలను జరిపింది. ఈసారి సీన్​ మారింది. ఇప్పుడు సెప్టెంబర్​​ 17  బీజేపీ వర్సెస్​ కాంగ్రెస్​ అన్నట్లుగా నడుస్తున్నది. రెండు జాతీయ పార్టీలు పరేడ్​ గ్రౌండ్​ను వేదికగా చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రానికి స్వాతంత్ర్య దినోత్సవంగా  వేడుకలు జరుపుతామని చెప్తున్నది. నిరుటిలానే పరేడ్​ గ్రౌండ్​లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఉంటాయని బీజేపీ అంటున్నది. ఇందు కోసం రెండు పార్టీలు వేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అధికార బీఆర్​ఎస్​ పార్టీ మాత్రం ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ విషయంలో ఎట్ల ముందుకు వెళ్లాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నది. 

నిరుడు మూడు రోజులు

తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2022లో తప్ప రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్​ 17 ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలేదు. నిరుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే అధికారిక కార్యక్రమం చేయడంతో.. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఏకంగా మూడు రోజుల పాటు ‘జాతీయ సమైక్యత’ పేరుతో జిల్లాలు, నియోజకవర్గాల్లో ‘సెప్టెంబర్​ 17’ కార్యక్రమాలు నిర్వహించింది.  ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.30 లక్షలు చొప్పున ఖర్చు చేసింది. ఈసారి ఎలక్షన్లు ఉండటంతో  రెండు జాతీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలకు ప్లాన్​ చేస్తుండటంతో బీఆర్​ఎస్​కు మింగుడు పడటం లేదు. ఎట్లయినా సరే ఆ రెండు పార్టీల వేడుకలను తలదన్నేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోగ్రామ్​ పెట్టాలని అనుకుంటున్నది. ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులకూ సీఎం టాస్క్​ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈసారి కూడా గతంలో మాదిరి బహిరంగ సభ పెట్టాలా లేదంటే  పబ్లిక్​ గార్డెన్​లో జెండా ఎగురవేసి సైలెంట్ గా ప్రోగ్రామ్​నిర్వహిస్తే  ఎట్ల ఉంటుందనే దానిపైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.