బాయిల్డ్‌‌ రైస్ ఇస్తామంటున్న రాష్ట్రం.. రా రైస్ ఇవ్వాలంటున్న కేంద్రం

బాయిల్డ్‌‌ రైస్ ఇస్తామంటున్న రాష్ట్రం.. రా రైస్ ఇవ్వాలంటున్న కేంద్రం

ఏప్రిల్ నుంచే వరి కోతలు.. పంట చేతికి వస్తున్న టైమ్‌‌లో వానల భయం
సర్కారు కొనకుంటే రైతులకు రూ.3 వేల కోట్లకు పైనే నష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: వడ్లపై పంచాయితీ తేలకపోవడంతో రైతులు గుబులు పడుతున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి వరి కోతలు ప్రారంభం కానుండటం, కొనుగోళ్లపై స్పష్టతలేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పంట చేతికి రాగా, ఇంకా చాలా చోట్ల చివరి దశలో ఉంది. మరోవైపు వాతావరణ మార్పులతో కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న చెడగొట్టు వర్షాలు రైతులను భయపెడుతున్నాయి. పంట కోస్తే వర్షాలకు దెబ్బతింటాయేమోనని, కోయకపోతే అలాగే కింద పడిపోతాయని ఫికర్ పడుతున్నారు.
35.84 లక్షల ఎకరాల్లో సాగు
రాష్ట్రవ్యాప్తంగా ఈయేడు యాసంగిలో 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. పంట ఏపుగా పెరగడంతో భారీగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు ఉన్నాయి. 83 లక్షల టన్నుల వడ్లు రావొచ్చని అంటున్నారు. నిరుడు యాసంగిలో 52.98 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ యాసంగిలో సర్కారు వరి వద్దనడంతో నిరుడు కంటే 17.14 లక్షల ఎకరాలు తగ్గింది. నిరుడు ప్రతి గింజను కొంటామని చెప్పిన సర్కారు.. ఇప్పుడు ఒక్క గింజ కూడా కొనబోమంటోంది. కొనుగోళ్ల నుంచి సర్కారు తప్పుకుంటే యాసంగి వడ్లు ఎవరు కొంటరనేది ప్రశ్నార్థకంగా మారింది.
రారైస్‌‌‌‌ సాధ్యం కాదట
యాసంగిలో రా రైస్ సరఫరా చేయలేమని రాష్ట్ర సర్కారు, సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇప్పటికే కేంద్రానికి  తేల్చిచెప్పింది. ఈ సీజన్‌‌లో బాయిల్డ్‌‌‌‌ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని రా రైస్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. యాసంగిలో వరి సాగు చేసే రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందినా.. రాష్ట్రం నుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన ఎలాంటి కార్యాచరణ సమర్పించలేదు. సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ ఎలాంటి ప్లాన్‌‌‌‌ రూపొందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు రా రైస్ ఉత్పత్తి కాదని, ప్రొక్యూర్‌‌‌‌మెంట్ కూడా చేయలేమన్నట్లు రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తోంది. ఎఫ్‌‌‌‌సీఐ రా రైస్‌‌‌‌ వంద శాతం తీసుకుంటామని, బాయిల్డ్ రైస్ కాకుండా పోషకాలున్న ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తే తీసుకుంటామన్నట్లు కేంద్రం చెబుతోంది.
రాష్ట్రమే రా రైస్ ఇవ్వొచ్చు!
యాసంగిలో రారైస్‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌ చేస్తే ఎండ తీవ్రతకు బియ్యం గింజ విరిగి నూక శాతం పెరుగుతుందని రాష్ట్ర సర్కారు చెబుతోంది. సాధారణంగా క్వింటాల్‌‌‌‌ ధాన్యం మిల్లింగ్‌‌‌‌ చేసి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌కు ఇది ఓకే అయినా రా రైస్‌‌‌‌కు అదనంగా 10 కిలోల నూక అయ్యే చాన్స్  ఉందని మిల్లర్లు అంటున్నరు. ఈ నష్టాన్ని పక్క రాష్ట్రాలు మిల్లులకు బోనస్‌‌‌‌గా ఇస్తున్నాయని, రాష్ట్రంలో కూడా బోనస్‌‌‌‌గా ఇస్తే రారైస్‌‌‌‌ ఇవ్వవచ్చని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు 60 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే.. రాష్ట్ర సర్కారకు రూ.1500కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే వచ్చిన నష్టంలో నూకలను ఇథనాల్‌‌‌‌ తయారీకి వినియోగిస్తే 1,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఎక్స్‌‌‌‌పర్టులు అంటున్నారు. ఎంత చూసినా రాష్ట్ర సర్కారుకు500 కోట్లకు మించి నష్టం ఉండదని చెబుతున్నారు. సర్కారు వడ్లు సేకరించక పోతే రైతులు అడ్డికిపావుసేరు అగ్గువకు అమ్ముకుని  రూ.3 వేల కోట్లకు పైగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌.. ఇలా కూడా చేయొచ్చు
బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ను కేంద్రం సేకరించని పరిస్థితి వస్తే.. దానికి బదులుగా ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌ తయారుచేసుకునే అవకాశం ఉంది. బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌, నూకలు, బియ్యం పిండి, విటమిన్స్‌‌‌‌, మినరల్స్‌‌‌‌ కలిపి బ్లెండింగ్‌‌‌‌ చేసి ప్రత్యేక రేషియోలో కలిపి తయారుచేసేదే ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌! కేంద్రం దేశవ్యాప్తంగా చిన్నారులకు పోషకాహారం అందించే కార్యక్రమాల్లో భాగంగా వీటిని అందిస్తోంది. అయితే ఈ బియ్యం మిల్లింగ్‌‌ చేసే  విషయంలో మిల్లర్స్‌‌‌‌ ముందుకు రాకపోవడం కూడా సమస్యగా మారుతోంది. కొన్నిచోట్ల మిల్లర్లు.. ఫోర్టిఫైడ్‌‌‌‌ బ్రెండింగ్‌‌‌‌ మెషీన్లు పెట్టినా ఫోర్టిఫైడ్‌‌‌‌ రైస్‌‌‌‌లో కలిపే మినరల్స్ దొరకడం లేదంటున్నరు. మొదట సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌.. మినరల్స్‌‌‌‌ను సరఫరా చేస్తామని చెప్పినా.. తర్వాత చేతులెత్తేసింది. 
సర్కారు కొనకుంటే క్వింటాల్‌‌‌‌కు రూ.500 దెబ్బే
యాసంగిలో ధాన్యం సేకరణకు సర్కారు ముందుకు వచ్చి సెంటర్లు తెరిస్తేనే సమస్య తీవ్రత తగ్గుతుంది. లేకపోతే రైతులకు మద్దతు ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదు. వ్యాపారులు క్వింటాల్‌‌‌‌కు రూ.500 వరకు కోత పెట్టే అవకాశం ఉందని మార్కెటింగ్‌‌‌‌ నిపుణులు అంటున్నరు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఇప్పటికే డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి.
కేంద్రానికి ప్రతిపాదనలు పంపలే
బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌కు బదులు రారైస్‌‌‌‌ ఇవ్వాలనే ఎఫ్‌‌‌‌సీఐ రూల్స్‌‌‌‌ నేపథ్యంలో కొనుగోళ్లపై సందిగ్ధం వీడలేదు. ఇప్పటిదాకా సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌.. ఎన్ని ఎకరాలు వరి వేశారు? ఎంత దిగుబడి వస్తుందని.. తప్ప కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలేవీ కేంద్రానికి పంపలేదు. దీంతో యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనే డైలమా వీడలేదు. సర్కారు కొనకపోతే వ్యాపారులకు అగ్గువకు అమ్ముకోవాల్సి వస్తుందని ఇప్పటి నుంచే రైతుల్లో ఆందోళన మొదలైంది.