మోదీజీ.. మీరే కాపాడాలి.. సౌదీ నుంచి వీడియో ద్వారా యూపీ యువకుడి విజ్ఞప్తి

మోదీజీ.. మీరే కాపాడాలి.. సౌదీ నుంచి వీడియో ద్వారా యూపీ యువకుడి విజ్ఞప్తి
  • ఇక్కడ చిత్ర హింసలు అనుభవిస్తున్నా.. చచ్చిపోతానేమో

న్యూఢిల్లీ: ఉపాధి కోసం వలస వచ్చి సౌదీలో చిక్కుకుపోయానని, యజమాని చేతిలో నరకం అనుభవిస్తున్నానని యూపీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. తన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేంత వరకూ షేర్ చేయాలని నెటిజన్లను అభ్యర్థించాడు. 

ఈ వీడియోలో ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మోదీజీ.. మీరే నన్ను కాపాడాలి. ఉపాధి కోసం వచ్చిన నన్ను ఇక్కడ మా యజమాని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. జీతం అడిగితే హింసిస్తున్నాడు. ఇండియాకు వద్దామంటే  నా పాస్ పోర్ట్ తిరిగివ్వడంలేదు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అలహాబాద్​లో నా కుటుంబం ఉంది. 

నాకు మా అమ్మను చూడాలని ఉంది. మీరే నన్ను కాపాడాలి. లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను. దయచేసి నన్ను కాపాడండి!" అంటూ ఆ యువకుడు కన్నీళ్లతో వేడుకున్నాడు. దీనిపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.