ఆలయ భూముల రక్షణకు.. దేవాదాయ శాఖకు టాస్క్​ఫోర్స్

ఆలయ భూముల రక్షణకు.. దేవాదాయ శాఖకు టాస్క్​ఫోర్స్
  • ఆలయ భూముల పరిరక్షణకు ప్రత్యేక బృందాలు 
  • రాష్ట్ర, జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ టీమ్​లు
  • హైడ్రా తరహా చర్యలకు సిద్ధమవుతున్న  ఎండోమెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధితోపాటు వాటి పరిధిలోని భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఆలయ భూముల పరిరక్షణ ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయడంతోపాటు జియోట్యా గింగ్ చేపడుతున్నది. 

అయితే, భూములు తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో దేవాదాయ శాఖ టాస్క్ ఫోర్స్ టీమ్​ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దీనిపై ఆ శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. రాష్ట్రస్థాయిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

 ఈ టాస్క్​ఫోర్స్​ టీమ్​లో ఎంతమంది ఉండాలనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆలయ భూముల రక్షణకు హైడ్రా తరహా చర్యలు చేపడితే  ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

25 వేల ఎకరాలు కబ్జా..

దేవాదాయశాఖ పరిధిలో 704 దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాలు ఉండగా.. అందులో 25 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. మరో 6 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలోఉన్నాయి.

 గత సర్కార్ నిర్లక్ష్యంతో భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురయ్యాయి. ఇక మీదట అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే భూములను జియో ట్యాగింగ్ చేస్తూనే.. మరోవైపు టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. 

ప్రతి జిల్లాకు టాస్క్ ఫోర్స్ టీమ్

రాష్ట్రస్థాయిలో భూములపై అవగాహన ఉన్నవారితో ఒక టాస్క్ ఫోర్స్ టీమ్​ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో, జిల్లాలో రెండు వేర్వేరుగా టాస్క్ ఫోర్స్ టీమ్​లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ టీమ్​లో ఎంతమంది ఉండాలి.. ఎంపిక విధానం, తదితర అంశాలపై యోచిస్తున్నారు. 

ప్రతి జిల్లాలో ఆలయ భూములు ఆక్రమణకు గురికావడంతో ఆలయాల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడినట్లు తెలిసింది. అయితే భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటే రెవె న్యూ పెరిగి ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. 

అయితే దేవాదాయశాఖలో ఇప్పటికే ఉద్యోగుల కొరత వేధిస్తున్నది. ఇప్పటికే ఏర్పాటు చేసిన ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ కూ సిబ్బంది లేరు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు కూడా ప్రభుత్వానికి సవాల్​గా మారింది.